ఏపీకి అప్పులే ఆధారం కానున్నాయా..!

Update: 2019-08-29 06:12 GMT
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్తితి రోజురోజుకూ దిగజారుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి కానీ దానికి తగ్గట్టుగా ఆదాయం రావడం లేదు. పైగా కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ఏమి రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అప్పులే ఆధారం కానున్నాయి. గత నాలుగు నెలలుగా ఏపీకి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం  జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో వివిధ శాఖలకు సంబంధించిన రెవిన్యూ వివరాలని అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా వాణిజ్యపన్నులు - ఎక్సైజ్ - రిజిస్ట్రేషన్ - స్టాంపులు - రవాణా శాఖలపై సీఎం సమీక్షించారు. ఇందులో ఏ శాఖలోనూ ఆదాయం అనుకున్నంత మేర రావడం లేదని అధికారులు సీఎంకి వివరించారు. మామూలుగా 14 శాతం ఉండాల్సిన వాణిజ్య పన్నుల వృద్ధి రేటు 5.3 శాతానికి తగ్గిపోయింది. ఇసుక అందుబాటులో లేకపోవడంతో గత నాలుగు నెలలుగా స్టీల్ - ఐరన్ - సిమెంట్ రేట్లు తగ్గిపోయాయి. దీని వల్ల వీటి మీద వచ్చే పన్నులు తగ్గిపోయాయి.

ఇక వాహన రంగంలో కూడా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దీని మీద వచ్చే జిఎస్‌ టి తగ్గిపోయింది. అయితే ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి అనుకున్న ఫలితాలు సాధిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే ఎక్సైజ్ శాఖలో ఆదాయం తగ్గింది.  లిక్కర్ వినియోగం గణినీయంగా తగ్గిపోవడం వల్ల ఆదాయం కూడా తగ్గిపోతు వచ్చింది.

2018-2019లో 125 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయం జరగ్గా.. బెల్టుషాపుల ఏరివేత వల్ల 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగం తగ్గిందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. అటు మద్యపాన నిషేదంగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 4380 నుంచి 3500కు దుకాణాలు తగ్గిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టు కింద 503 దుకాణాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే మద్యపాన నిషేధం వల్ల స్మగ్లింగ్ - నాటు సారా తయారీ కాకుండా చూసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అయితే ఇలా వివిధ శాఖల్లో ఆదాయం తగ్గిపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది. పింఛన్లు - పలు సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయాలంటే నగదు అవసరం గట్టిగానే ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్రానికి అప్పులే ఆధారం కానున్నాయి.


Tags:    

Similar News