సిట్ ముందు పిలిచే మాజీ మంత్రులు వీళ్లేనా..?

Update: 2020-02-22 07:45 GMT
గత ప్రభుత్వంలో జరిగిన పనులపై సమీక్షించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతో తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారు ఇప్పుడు బెంబేలెత్తుతున్నారు. తమ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను సిట్ గుర్తించి తమను పిలుస్తుందేమోనని భయపడుతున్నారు. సిట్ ఏర్పాటుతో ఆ పార్టీ నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పీఏ నివాసాలపై దాడులతో ఉక్కిరిబిక్కిరవుతుంటే తాజాగా సిట్ ఏర్పాటుతో ఇక తాము తప్పించుకునే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.

 ఐదేళ్ల కాలంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై దర్యాప్తు చేయడంతో పాటు అవసరమైతే అప్పటికప్పుడు కేసులు కూడా నమోదు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) త్వరలోనే పని మొదలు పెట్టే అవకాశం ఉంది. టెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో ఈ బృందం రంగంలోకి దిగనుంది. అయితే చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉన్న వారు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్న వారిలో కలవరం మొదలైంది. గతంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమగ్రంగా పరిశీలించి ఇప్పటికే ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. ఆ నివేదికను కూడా సిట్ పరిశీలించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

అయితే సిట్ ముందుగా అప్పటి మంత్రులుగా ఉన్న వారిలో ఎవరిని పిలుస్తుందోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యంగా నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వర రావును పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుల పేరు మీద ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా సక్రమంగా నిర్మించ లేదు. టెండర్లు పిలిచి తమకు కావాల్సిన వారికి లాభాలు వచ్చేలా చేశారని తెలుస్తోంది. పైగా రాజధాని సమీపంలోని నియోజక వర్గం మైలవరానికి ప్రాతినిథ్యం వహించడంతో ఆయనకు రాజధాని కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని సిట్ కూడా భావిస్తోంది.

దీంతోదేవినేని ఉమను పిలుస్తారని టాక్ నడుస్తోంది. అనంతరం విద్యాశాఖ మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అప్పటి మంత్రులు అనిత, జవహార్ తదితరులను పిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరు అప్పట్లో చూసిన శాఖలపై సిట్ సమగ్రంగా పరిశీలించి త్వరలోనే వీరు పిలుస్తారని సమాచారం. వీరు మంత్రులుగా పని చేసిన కాలంలో తమ శాఖలతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు. అందుకే పలు అవినీతి, అక్రమాల్లో వీరి ప్రమేయం ఉందని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సిట్ పిలిచే అవకాశం ఉంది. ఆ వరుసలో దేవినేని ఉమ, గంట, అనిత, సోమిరెడ్డి, జవహార్ ముందున్నారు.
Tags:    

Similar News