బిచ్చగాళ్లకు భారీ ప్యాకేజి

Update: 2016-07-15 07:35 GMT
 బిచ్చగాళ్లంటే కష్టాలకు ఎదురీదుతున్నవారు అనుకోనవసరం లేదు. కొందరికి మాత్రమే అలాంటి కష్టాలు పరిమితం. చాలామందికి మాత్రం అది మంచి ప్రొఫెషన్.. సాఫ్టువేర్ ఉద్యోగుల స్థాయిలో సంపాదించే బిచ్చగాళ్లు కూడా ఉన్నారని ఎన్నోసార్లు తేలింది. కోట్లకు పడగలెత్తిన బిచ్చగాళ్లూ ఉన్నారు. డిగ్రీలు - పీజీలు చేసినా బిచ్చమెత్తుకుంటున్నవారు... వడ్డీలకు అప్పులిస్తూ కూడా బిచ్చమెత్తుకుంటున్నవారు చాలామంది. పర్వదినాలు - పండుగ రోజులు వచ్చాయంటే వారికి నిజంగా పండగే.. ఇక పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల వంటి   సందర్భాల్లో వారి ఆదాయం మూడు పువ్వులు - ఆరు కాయలే. తాజాగా కృష్ణా పుష్కరాల కోసం కూడా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన బిచ్చగాళ్లు కూడా రెడీ అవుతున్నారు. బిచ్చగాళ్ల తాకిడి పెరిగితే భక్తులకు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వారిని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే.. వారిని బెదిరించి బతిమాలి వెళ్లగొట్టడం లేదు. భారీ ప్యాకేజీతో ఎదురు ఆఫర్ ఇచ్చి పుష్కరాల వేళ ఇబ్బందులు తప్పించనుంది.

పుష్కరాల నాటికి ఒక్క బిచ్చగాడు కూడా బెజవాడలో కనిపించకూడదని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. జిల్లా ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు వెంటనే కార్యాచరణ కూడా మొదలైంది.  గత ఏడాది గోదావరిపుష్కరాల సమయంలో రాజమండ్రిలో ఉన్న బిచ్చగాళ్లను తరిమేశారు. అప్పుడు కూడా బిచ్చగాళ్లకు ప్రభుత్వం బంపర్ ఆఫరే ఇచ్చింది. ఒక్కో బిచ్చగాడికీ 10 వేల రూపాయలు ఇవ్వడానికి - రోజూ అల్పాహారం - మధ్యాహ్న భోజనం - రాత్రి భోజనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చే డబ్బు కన్నా - అధికంగా సంపాదించవచ్చని వారు భావించి అధికారుల ఆదేశాలను ససేమిరా అన్నారు. వీరు మొండికేయడంతో హోం మంత్రి చినరాజప్ప - మున్సిపల్ మంత్రి నారాయణ రాత్రికి రాత్రి బిచ్చగాళ్ళ ప్రాంతాలకు వెళ్లారు. వెళుతూ వెళుతూ వారి వెంట ఓ బయోమెట్రిక్ మిషన్ తీసుకువెళ్లారు. దాన్ని బిచ్చగాళ్లకు చూపి - ఇక్కడే ఉంటే - మీకు అందే రేషన్ కార్డు - ఇతర ప్రభుత్వ పథకాలు రద్దపోతాయని బెదిరించారు. దీంతో బిచ్చగాళ్ళు నగరాన్ని వదిలి వెళ్లిపోయారు.

ఇదే విధానాన్ని కృష్ణా పుష్కరాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు బెజవాడలోని బిచ్చగాళ్ల కోసం వేట ప్రారంభించారు. అధికారులు బృందాలుగా విడిపోయి గుడులు - గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ఫుట్‌ పాత్‌ ల మీద బిచ్చం ఎత్తుకునే వారి వివరాలనూ సేకరిస్తున్నారు. ఒక్కో బిచ్చగాడికి ఐదు వేల రూపాయలు - 12 రోజులపాటు షెల్టరు - రోజు భోజనం - టిఫిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. వీరి బాగోగులను చూసుకునే బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.
Tags:    

Similar News