అంగన్ వాడీల ఇష్యూలో ఎవరి తప్పు ఎంత?

Update: 2015-12-24 04:24 GMT
ఆచితూచి వ్యవహరిస్తూ.. ఎవరిని నొప్పించకుండా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా భారీ నిర్ణయాన్ని తీసుకోవటం సంచలనంగా మారింది. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్ వాడీలు నిర్వహించిన చలో అసెంబ్లీ ఆందోళనలో పాల్గొన్న వారిని విధుల నుంచి తప్పించాలంటూ ఏపీ సర్కారు తాజాగా జారీ చేసిన జీవో కలకలం రేపుతోంది. ఈ నెల 21న మెమో నెంబర్ 5557/k3/2015 పేరిట మహిళా.. శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్ బీహెచ్ ఎన్ చక్రవర్తి పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. తాజా ఉత్తర్వుల కారణంగా దాదాపుగా 14 వేల మంది అంగన్ వాడీ కార్యకర్తలు.. ఆయాల ఉద్యోగాల మీద ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏపీ రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలు.. సహాయకులు మొత్తంగా 20వేల మంది వరకూ ఉన్నారు. వీరికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఏళ్లకు ఏళ్లుగా ఉన్నాయి. వీరికిచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉండటం.. వీరి సమస్యల పట్ల తాను సానుకూలంగా ఉన్నట్లుగా చంద్రబాబు ఎన్నికల సందర్భంగా పలు సభల్లో మాట్లాడారు. తమ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్ వాడీల సమస్యల్ని పరిష్కరిస్తానని వ్యాఖ్యానించారు. అయితే.. తెలంగాణ సర్కారు అంగన్ వాడీల వేతనాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ సర్కారు కూడా జీతాల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది.

అంగన్ వాడీలు.. సహాయకులు ఎలాంటి ఆందోళన చేయకుండానే ఏపీ సర్కారు సముచిత నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆగస్టు చివరి వారంలో మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సులకు తగ్గట్లే.. అంగన్ వాడీ కార్యకర్తలకు రూ.7100.. సహాయకులకు రూ.4600 చొప్పున వేతనాలు పెంచుతామని.. ఈ పెంపు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేయనున్నట్లు బాబు సర్కారు హామీ ఇచ్చింది.

ఈ హామీ అమలు గడిచిన మూడు నెలలుగా అమలు కాకపోవటంతో.. డిసెంబరు 18న అంగన్ వాడీలు ‘‘చలో అసెంబ్లీ’’ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. దీనికి ఏపీలోని 13 జిల్లాలకు చెందిన అంగన్ వాడీలు విజయవాడ చేరుకున్నారు. వీరి ఆందోళన ఊహించినదాని కంటే తీవ్రంగా ఉండటం.. ఒక దశలో ఏపీ సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించటం ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కరుకుగా వ్యవహరించి.. విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేసినట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్యపై ఏపీ విపక్ష నేత జగన్ ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే.. ఆందోళనలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం చెప్పిన రీతిలో తన నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే అంగన్ వాడీలు అసలు ఆందోళనల వరకూ వచ్చే వారు కాదని.. వారి ఆందోళన వెనుక ఏపీ సర్కారు వైఫల్యం ఉందన్న విషయం మర్చిపోకూడదని చెబుతున్నారు. ఓపక్క తమకిచ్చిన హామీల్ని నెరవేర్చని నేపథ్యంలో ఆందోళన చేస్తే.. పోలీసుల పుణ్యమా అని ఈ వ్యవహారం మరింత ముదిరితే.. తాజాగా ఏపీ సర్కారు వేటుతో ఇదో రాజకీయ అంశంగా మారే వీలుందన్న భావన వ్యక్తమవుతోంది.

అంగన్ వాడీ ఎపిసోడ్ లో తప్పొప్పులు లెక్కలు తీస్తే.. ఏపీ సర్కారు తప్పులే ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్నికల సందర్భంగానూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన వైఖరే డిసెంబరు 18 ఆందోళనలకు కారణంగా చెప్పొచ్చు. హమీల అమలులో జాప్యం చేసి ఒక తప్పు చేస్తే.. ఆందోళన చేసిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించటం ద్వారా భారీ వర్గానికి బాబు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ విషయంపై బాబు వీలైనంత త్వరగా పునరాలోచన చేయటం మంచిదన్న భావన వ్యక్తమవుతోంది. ఎంత ఆందోళన చేస్తే మాత్రం మూకుమ్మడిగా ఉద్యోగాలు తీసేస్తారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News