అవును.. 2 వారాల లోపే ఇల్లు రెఢీ

Update: 2015-09-25 13:16 GMT
వినేందుకు ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజం. పేద‌ల‌కు క‌ట్టించి ఇచ్చే ఇళ్ల నిర్మాణం ఏళ్ల‌కు ఏళ్లుగా సాగ‌టం.. అందులో అవినీతి మ‌కిలితో ల‌బ్థిదారుల‌కు ఇళ్లు చేర‌క‌పోవ‌టం.. లాంటి ఎన్నో స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్ప‌ట‌మే కాదు.. అత్యాధునిక ప‌ద్ధ‌తుల్ని అనుస‌రించి పేద‌ల‌కు వినూత్నంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని భావిస్తోంది ఏపీ స‌ర్కారు. ఇందుకోసం స‌రికొత్త విధానాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తోంది.

ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చిన అధునాత‌న సాంకేతిక‌త సాయంతో ఈ ఇళ్ల‌ను నిర్మించాల‌ని భావిస్తున్నారు. తొలిద‌శ‌లో ఏపీ తాత్క‌లిక రాజ‌ధాని విజ‌య‌వాడ‌కు స‌మీపంలో నిర్మించే ఈ ఇళ్ల‌ను ఊహించ‌నంత త‌క్కువ స‌మ‌యంలోనే నిర్మాణం పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. కేవ‌లం రెండంటే రెండు రోజుల నుంచి ప‌ద్నాలుగు రోజుల్లోపే ఇళ్ల నిర్మాణం మొత్తం పూర్తి చేసేసి పంపిణీ చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు.

అంటే.. నిధులు సిద్ధంగా ఉండి.. ఇళ్ల నిర్మాణానికి ప‌చ్చ జెండా ఊపితే వారం.. ప‌ది రోజుల్లోనే ల‌బ్థిదారుల‌కు ఇళ్ల‌ను పూర్తి చేసి ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ఈ అధునాత‌న సాంకేతిక‌తతో నిర్మించే ఇల్లు ఒక్కొక్క‌టి రూ.2.75ల‌క్ష‌ల‌కు మించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నారు.

ఈ సాంకేతికత‌లో శ్లాబు.. గోడ‌లు.. ఇలా అన్నీ ముందే సిద్ధం చేసి ఉంచుతారు. ప్రీప్యాబ్ ఇళ్లుగా పిలిచే వీటిని విదేశాల్లో ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు. సంప్ర‌దాయ ఇళ్ల నిర్మాణానికి అల‌వాటు ప‌డిన వారు వీటిని ఒక‌ప‌ట్టాన న‌మ్మరు.  అందుకే.. పైలెట్‌ప్రాజెక్టుగా విజ‌య‌వాడ‌కు స‌మీపంలో ఒక వంద ఇళ్ల‌ను నిర్మాణం చేయించి.. వాటి ఆధారంగా మిగిలిని ఇళ్ల నిర్మాణానికి ఏపీ స‌ర్కారు అమోదం ప‌ల‌కాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టును విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌గ‌లిగితే.. గృహ నిర్మాణాల విష‌యంలో ఏపీ స‌ర్కారు కొత్త పుంతలు తొక్కే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News