ఇప్పటి నుంచే కృష్ణా పుష్కరాలకు...

Update: 2015-07-24 13:32 GMT
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఆ ఏర్పాట్లలో ఉండగానే వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలపై కూడా కన్నేసింది. వాటిని కూడా ఘనంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా విజయవాడ ఇంద్ర కీలాద్రి సమీపంలోని ఫ్లై ఓవర్ ను ఏడాదిలోగా పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది.

దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవలే దీనికి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.350 కోట్లతో పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. కిలోమీటరున్నర మేర దీనిని నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జూలైలోపులో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పుడు దీని పనులు వేగవంతం కానున్నాయి.

దుర్గ గుడి వద్ద జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ రానుంది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించడంతోపాటు ఫ్లై ఓవర్ ను ఆరు లైన్లుగా నిర్మిస్తారు. అంటే మొత్తంగా పది లేన్లలో జాతీయ రహదారితోపాటు ఫ్లై ఓవర్ ఇక్కడ రానుంది. కృష్ణా పుష్కరాలు 2016 ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు నాటికి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది.


Tags:    

Similar News