ఐఏఎస్, ఐపీఎస్ లకు దసరా లేదు

Update: 2015-10-12 10:15 GMT
ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు ఈ దసరాకు 15 రోజుల సెలవులు... కానీ, రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు మాత్రం దసరా రోజున కూడా సెలవు లేదు. కారణం..... నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం, ప్రధాని, ఇతర ప్రముఖల రాకతో ఏర్పాట్లు చేయాల్సి ఉండడమే. దీంతో వారంతా ఈ దసరా ఇంతే అనుకుంటున్నారట.

రాష్ట్రంలోని ఐపీఎస్ - ఐఏఎస్ అధికారులకు రాజధాని శంకుస్థాపన కార్యక్రమ విధుల నిమిత్తం సెలవు పెట్టే వీలులేదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అధికారులంతా తమకు కేటాయించిన పనుల్లో తలమునకలుగా ఉన్నారు. లక్ష మంది హాజరయ్యే కార్యక్రమం... అత్యంత ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానున్న కార్యక్రమం కావడంతో ఎక్కడ తేడా జరిగినా ఉద్యోగాలు పోతాయన్న భయం అధికారుల్లో ఉంది. దీంతో వారిలో దసరా ధ్యాస కంటే శంకుస్థాపన కార్యక్రమం భయం వారిలో కనిపిస్తోంది.

కాగా దసరాను మిస్సవుతున్నందుకు కొందరు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా... ఇంకొందరు మాత్రం చంద్రబాబు ఆ మిస్సింగ్ ను ఏదో రకంగా కాంపన్సేట్ చేస్తారని ఆశిస్తున్నారు. ఇంకొందరు మాత్రం లోపల ఎంత అసంతృప్తి ఉన్నా... దసరా ఏటా వచ్చేదే శంకుస్థాపన మళ్లీ వస్తుందా అంటూ తెలివితేటలు చూపిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు వద్ద చనువు ఉన్న ఉన్నతాధికారులు మాత్రం ఇంకో ప్లాను వేశారు. శంకుస్థాపన కోసం దసరా రోజున పనిచేసినా  ఆ మరుసటి రోజు సెలవు కోరాలని వారంతా అనుకుంటున్నారు. ఇప్పటికే కొందరు చంద్రబాబుకు ఈ సంగతి చెప్పగా ఆయన చూద్దాం అన్నట్లు తెలిసింది.

గత ఏడాది హుద్ హుద్ తుపాను సహాయ పనుల కారణంగా దీపావళిని మిస్సయిన అధికారులు ఈసారి దసరాను మిస్సవుతున్నారు.
Tags:    

Similar News