మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ...చర్చించే అంశాలు ఇవే?

Update: 2019-12-27 05:05 GMT
అమరావతి లో నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ భేటీ కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలో అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్‌ రావు కమిటీ అందజేసిన నివేదికతో పాటు పలు కీలక అంశాలను చర్చించనున్నారు. అలాగే రాజధాని అంశం పై ఈ భేటీ అనంతరం ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడనుంది అని తెలుస్తుంది. మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతారా.. లేక అమరావతి ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తి కరంగా మారింది.

ఇక మూడు రాజధానుల అంశం పక్కన పెడితే జగన్ సర్కార్ విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలింపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇక్కడ తేలాల్సింది కర్నూలు కు హైకోర్టు.. అమరావతి భవితవ్యం.

అలాగే ఈ సమావేశంలోనే కొత్తగా 104, 108 వాహనాల కొనుగోలు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి సవరణలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

అలాగే స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్ల పై కూడా ఈ భేటీ లో చర్చించనున్నారు. రాష్ట్రం లో ప్రత్యేక ఎకనామిక్‌ జోన్ల ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం అమలు, కాలుష్య నిర్వహణ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ.10 లక్షల సాయం, న్యాయవాదుల సంక్షేమ నిధి, ప్రభుత్వ భూముల అమ్మకాలు, బిల్డ్ ఏపీ వంటి ముఖ్యమైన అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. ప్రస్తుతం అమరావతి లోనే రాజధాని ని ఉంచాలంటూ రైతులు ధర్నాలు చేస్తున్నారు ..ఈ సమయంలో ఏపీ కేబినెట్ సమావేశం ఉండటంతో పోలీసులు భద్రత ను పెంచారు. రాజధాని గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూడాలి మరి ఏపీ క్యాబినెట్ ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారో ...


Tags:    

Similar News