అప్పులాంధ్రాకు అంత ఆదాయమా....?

Update: 2022-01-16 14:43 GMT
ఏపీని పట్టుకుని అప్పుల ఆంధ్రా అని చులాగ్గా విమర్శలు చేసేస్తారు. ఏపీ విభజన తరువాత ఇబ్బందులు పడుతోంది. సరైన తీరున రాబడి అయితే లేదు. దాంతో నాడూ నేడూ కూడా అప్పులు తెచ్చారు. దాంతో అప్పుల ఏపీ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చిత్రంగా వర్తమాన ఆర్ధిక సంవత్సరం ఏపీకి కొత్త కళను తెచ్చిపెట్టింది.  అలా అప్పుల ఆంధ్రా పేరు మార్చేసి  ఏపీని వేరే విధంగా చెబుతోంది. ఏపీకి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిందని అంటోంది. ఒక విధంగా చూస్తే ఇది  మేలు మలుపుగానే చూడాలి.

ఈ ఆదాయం అంతా కూడా కరోనా టైమ్ లోనే వచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో   ఏపీకి ఆదాయం పెరిగింది. అది ఎలా అంటే అంతకు ముందు వచ్చిన ఆదాయం కంటే 39 శాతం ఎక్కువగా  అని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాదు వృద్ధి రేటు కూడా బాగా పెరిగింది అని వివరాలు తేటతెల్లం చేస్తున్నాయి.

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పెరిగింది. అదెలా అంటే 2021 నవంబర్ వరకూ లెక్కలు చూస్తే ఏపీకి 88 వేల 618 రూపాయల ఆదాయం వచ్చింది అని తెలుస్తోంది. మూడవ దశ కరోనా ఒక వైపు వీర విహారం చేస్తున్న వేళ ఏపీకి ఆదాయం పెరగడం అంటే ఖజానాకు తీపి వార్తే అంటున్నారు.

ఇలా పెరిగిన ఆదాయంతో అప్పుల బాధ లేకుండా ఉంటుందని కూడా అంటున్నారు. ఈ ఆదాయం అంతా పన్నుల వసూళ్ళు బాగా ఉండడం వల్లనే అని చెబుతున్నారు. వివిధ రకాలుగా చూసినా ప్రభుత్వానికి రాబడులు వస్తున్నాయని అంటున్నారు. అదే విధంగా సంక్షేమ పధకాలను విచ్చలవిడిగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది అన్న విమర్శలు గట్టిగా ఉన్నాయి. కానీ అలా ప్రజలకు పంచిన మొత్తాలే మార్కెట్ ఎకానమీకి  బలమైన అండగా నిలుస్తున్నాయని అంచనాలు తెలియచేస్తున్నాయి.

ప్రజలకు ఇచ్చిన డబ్బు మళ్లీ మార్కెట్ కి చేరి ఆ విధంగా ఆదాయం పన్నుల రూపంలో తిరిగి  సర్కార్ ఖజానాకు జమ అవుతోంది అంటున్నారు. ఇక ఏపీ ఆదాయాన్ని గత అయిదేళ్ళుగా తీసుకుంటే కేవలం 2021-22 ఆర్ధిక సంవత్సరంలోనే ఆదాయం పెరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు జమానాలో 2017-18 ఏడాదిని చూసుకుంటే ఏపీకి 58 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 2018-19 ఏడాదికి 74 వేల కోట్లు వచ్చాయి.

ఇక 2019-20 అంటే జగన్ సీఎం అయిన తొలి ఏడాది అన్న మాట. నాడు ఏపీకి ఆదాయం 63 వేల కోట్లు మాత్రమే వచ్చింది. అది 2020-21 ఆధిక సంవత్సరానికి 66 వేల కోట్లకు పెరిగింది. ఇక 2021-22లో ఏకంగా 88 వేల కోట్లకు పెరగడం అంటే ఏపీ విభజన తరువాత ఇంతటి స్థాయి ఆదాయం ఎపుడూ లేదు అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

అదే టైమ్ లో వృద్ధి రేటు కూడా గడచిన కాలం కంటే బాగా పెరిగింది అని లెక్కలు చెబుతున్నాయి. ప్రతీ ఏటా 15 శాతానికి మాత్రమే పరిమితమైన వృద్ధి రేటు ఈసారి ఏకంగా 39 శాతానికి ఏగబాకడం అంటే నిజంగా ఏపీ సర్కార్ కి ఊరటను ఇచ్చే పరిణామంగా చెప్పుకుంటున్నారు. ఇలా పెరిగిన ఆదాయాలు అప్పుల విషయంలో ఎంతవరకూ ప్రభావం చూపుతున్నాయి అంటే చాలానే అని చెప్పాలి అంటున్నారు.

గత ఏడాది ఇదే నవంబర్ నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఏకంగా 73 వేల కోట్ల పై దాటి ఉంటే ఈసారి నవంబర్ నాటికి ఆ అప్పులు 43 వేల కోట్లకు తగ్గాయి. అంటే ఆదాయం పెరగడం వల్లనే అప్పులు అంతలా చేయడంలేదు అనుకోవాలేమో. ఏది ఏమైనా ఇదే తీరున ఆదాయాలు పెరిగి వృద్ధి రేటు బాగుంటే ఏపీకి అప్పుల బాధ తప్పుతుంది. అదే టైమ్ లో అప్పులాంధ్రా ప్లేస్ లో ఆదాయాంధ్రాగా కూడా ఏపీని పిలిచే రోజులు కూడా దగ్గరలో ఉంటాయని చెప్పవచ్చు.
Tags:    

Similar News