అడ్డం తిరిగిన మంత్రుల కమిటి

Update: 2022-01-29 04:13 GMT
ఉద్యోగసంఘాల నేతలతో సంప్రదింపుల కోసం నియమించిన మంత్రుల కమిటి అడ్డం తిరిగింది. తామంతట తాముగా ఉద్యోగసంఘాల నేతలు వస్తేనే చర్చలు జరుపుతామంటు మంత్రి బొత్స సత్యానారాయణ స్పష్టంగా చెప్పేశారు. నేతలతో చర్చలు జరిపేందుకు నాలుగు రోజులుగా వెయిట్ చేస్తున్న కమిటిని ఉద్యోగనేతలు చాలా చులకనగా చూస్తున్నారంటు మంత్రి మండిపడ్డారు. నాలుగు రోజులుగా వరసగా కమిటి మొత్తం వచ్చి కూర్చుంటే ఉద్యోగ నేతలు అలుసుగా చూస్తున్నారని బొత్స ఆవేధన వ్యక్తంచేశారు.

తమను చులకనగా చూసిన ఉద్యోగనేతల కోసం ఇకనుండి వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. మంత్రుల కమిటితో చర్చించాలని అనుకుంటే ఉద్యోగ నేతలే తమకు కబురు పంపాలని మంత్రి తేల్చిచెప్పారు. ప్రతిరోజు తమ పనులన్నింటినీ వదులుకుని ఉద్యోగ నేతల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఇకపై లేదన్నారు.  పీఆర్సీ నేపధ్యంలో జీతాల తగ్గుదలపై ఉద్యోగుల్లోని  అపోహను తొలగించేందుకే ప్రభుత్వం మంత్రుల కమిటిని నియమించిన విషయం గమనించాలన్నారు.

చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తమ కమిటి నాలుగు మెట్లు దిగినా ఉద్యోగ నేతలు మాత్రం పట్టించుకోకపోవటం సరికాదన్నారు. కొత్త పీఆర్సీ వల్ల ఏ ఉద్యోగి జీతమూ తగ్గదని మరోసారి చెప్పారు. ఈ విషయం అర్ధమవ్వాలంటే ముందు మొదటి నెల జీతం తీసుకుంటేనే తెలుస్తుందంటున్నారు. మొదటి నెల జీతం వేయాలని ప్రయత్నిస్తున్న ట్రెజరీ ఉద్యోగులను ఉద్యగసంఘాలు అడ్డుకోవటం సరికాదన్నారు.

మంత్రి ఆవేదన ఎలాగున్నా మంత్రుల కమిటితో చర్చలకు వెళ్ళుండాలనే వాదన విశ్లేషకులు చెబుతున్నారు. పీఆర్సీ సాధన సమితి తరపున అందరు నేతలు కాకపోయినా కనీసం ఇద్దరన్నా అటెండ్ అయ్యుంటే బాగుండేదని బయటి వ్యక్తుల మాట. వివాద పరిష్కారానికి చర్చలు జరపటం ఒకటే మార్గమని  హైకోర్టు కూడా చెప్పింది. పైగా సమ్మెచేసే హక్కు ఉద్యోగులకు లేదని కోర్టు చేసిన వ్యాఖ్యలను ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు. మీడియా సమావేశాల్లో ఉద్యోగనేతలు చేసే డిమాండ్లేవో మంత్రుల కమిటి ముందు చర్చల్లో చేస్తే సరపోయేది. మరిప్పటికైనా ఉద్యోగనేతలు చర్చలకు వెళతారో లేదో చూడాలి.
Tags:    

Similar News