అసైన్డ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే పరిహారం ఇవ్వాల్సిందే: ఏపీ హైకోర్టు

Update: 2022-05-31 06:30 GMT
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రజోపయోగ కార్యకలాపాల కోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూమిని వెనక్కి తీసుకుంటే దానికి కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. అసైన్డ్‌ భూముల లబ్ధిదారులు 2013 భూ సేకరణ చట్టం లేదా రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇతర చట్టం కింద పరిహారానికి అర్హులేనని తాజాగా తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో జారీ చేసిన జీవో 259 ఆధారంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు హైకోర్టు వివరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు.

పారిశ్రామిక పార్క్‌ కోసం అధికారులు వెనక్కి తీసుకున్న తమ అసైన్డ్‌ భూములకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వడంలేదని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మంగళం గ్రామానికి చెందిన కె.నాగవేణి, మరో ఇద్దరు 2018లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కురకాల్వ గ్రామంలో తమకున్న 3.32 ఎకరాల భూమిని ప్రభుత్వం పారిశ్రామిక పార్కు నిమిత్తం తీసుకుందని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు. ఇది అసైన్డ్ భూమి కాబట్టి వెనక్కి తీసుకున్నామని.. పరిహారం చెల్లించక్కరలేదని తహసీల్దార్ చెబుతున్నారని నివేదించారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం భూ సేకరణ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. తాజాగా ఈ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి తుది విచారణ జరిపారు.
పిటిషనర్లు కె.నాగవేణి, తదితరుల తరఫు న్యాయవాది కాలవ సురేష్‌ కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారానికి అర్హులని వివరించారు. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్‌ భూమికి పట్టా భూమితో సమానంగా ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మేకల పాండు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిందని తెలిపారు. ఆ స్టే ఎత్తివేసేంత వరకు జీవో 259 ప్రకారం పిటిషనర్లు కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.

ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలను న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి తోసిపుచ్చారు. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్‌ భూమిని ప్రజోపయోగం కోసం వెనక్కి తీసుకుంటే పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులో పిటిషనర్లకు ఆరు నెలల్లోగా పట్టా భూమితో సమానం వారి అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Tags:    

Similar News