చివరగా..; సెలవు రోజున వెళ్లారు

Update: 2016-10-02 04:34 GMT
ప్రభుత్వ ఉద్యోగులు అన్న వెంటనే ఒక అపప్రద ఉంటుంది. వారిని పలువురు విమర్శిస్తుంటారు. ప్రైవేటు ఉద్యోగులతో పోలిస్తే.. ప్రభుత్వ ఉద్యోగులు రిలాక్స్ డ్ గా ఉంటారు. కానీ.. అందరూ కాదన్నది సత్యం. ఎందుకంటే.. ఈ రోజున వ్యవస్థ ఇలా అయినా నడుస్తుందంటే దానికి కారణం.. కమిట్ మెంట్ ఉన్న ఉద్యోగుల పని తీరే. బద్ధకంగా వ్యవహరిస్తూ పని చేయని వారు ఉన్నా.. చాలామంది తమదైన కమిట్ మెంట్ తో పని చేస్తూ కనిపిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని రాతి మనుషులుగా.. వారిలో భావోద్వేగాలు తక్కువన్నట్లుగా సినిమాలోనూ.. మీడియాలోనూ చూపించటం చూస్తుంటాం. అయితే.. ఇది ఒక కోణం మాత్రమేనన్న విషయాన్ని చాలామంది పట్టించుకోరు.

మంచి కంటే చెడు చాలా త్వరగా వ్యాపిస్తుందన్నట్లు.. నిజాయితీ ఉండే ఉద్యోగులు.. కమిట్ మెంట్ తో వ్యవహరించే ఉద్యోగుల్ని ఇదే సినిమా.. మీడియాలో చూపించినా మనసుకు ఎక్కదు. అదే.. దుష్టులుగా.. దుర్మార్గులుగా చూపించే ఉదంతాలు మనసులో ముద్రించుకుపోతాయి. చాలామంది అనుకున్నట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు రాతి మనుషులు కాదని.. వారిలో భావోద్వేగాలు మిగిలినవారి మాదిరే ఉంటాయన్న విషయం అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. అయితే.. అలాంటి అంశాలకు ఫోకస్ తక్కువ.

తెలంగాణ  ఉద్యమ సమయంలో రెండుప్రాంతాల ఉద్యోగుల మధ్య నడిచిన ఉద్రిక్త వాతావరణాన్ని పతాక శీర్షికల్లో ప్రచురించిన మీడియా.. తాజాగా భావోద్వేగంతో కదిలిపోతున్న ఉదంతాల్ని లైట్ తీసుకోవటం కనిపిస్తుంది. విభజన జరిగి రెండున్నరేళ్లు అయినా.. ఏపీ సచివాలయ ఉద్యోగులు శుక్రవారం వరకూ పని చేస్తూనే ఉన్నారు. సోమవారం నుంచి ఏపీ పాలన మొత్తం వెలగపూడి నుంచి సాగనున్న నేపథ్యంలో.. శనివారం సెలవు ఇచ్చేసి.. వెలగపూడికి వెళ్లేందుకు వీలుగా సర్దుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సచివాలయంతో ఉన్న అనుబంధం శాశ్వితంగా తెగిపోయిన వేళలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఏపీ సచివాలయ ఉద్యోగులు. వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోవటమే కాదు.. తమ పరిస్థితి అంతేలా ఉందన్న వైనాన్ని ప్రదర్శించిన తెలంగాణ ఉద్యోగుల తీరుతో ప్రతి ఒక్కరి కంట్లో కన్నీరు సుడులు తిరుగుతుండగా.. గండె చిక్కబెట్టిన వైనం సచివాలయంలో శనివారం స్పష్టంగా కనిపించింది.

అధికారికంగా సెలవు అయినప్పటికీ శనివారం చివరిసారిగా ఏపీ ఉద్యోగులు సచివాలయానికి వెళ్లారు. ఇంతకాలం తాము పని చేసిన ప్రాంగణం మొత్తాన్ని కలియతిరగటమే కాదు.. తెలంగాణ సచివాలయం లోనూ తిరిగారు. ఈ సందర్భంగా ఒకరితో ఒకరు ఫోటోలు తీసుకున్నారు. సచివాలయాన్ని విడిచి వెళ్లటం తమను ఎంతగా బాధిస్తుందన్న విషయాన్ని పలువురితో పంచుకున్నారు. ఏపీ ఉద్యోగులతో కలిసి తెలంగాణ ఉద్యోగులు తమ అనుభవాలు.. అనుభూతుల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కలిసి భోజనం చేయడంతో పాటు.. కంట తడిపెట్టుకున్నారు. తమను గుర్తు పెట్టుకోవాలని ఏపీ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తే.. మీరు ఇప్పుడు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామన్నారు తెలంగాణ ఉద్యోగులు. మొత్తంగా.. శనివారం సచివాలయం భావోద్వేగ వేదికగా మారిపోయింది.
Tags:    

Similar News