అమ‌రావ‌తి....డైలీ సీరియ‌ల్ ఎనిమిదో భాగం!

Update: 2016-07-26 09:24 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా ప‌రిపాల‌న సాగించాల‌నే ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌ప‌న‌  డైలీ సీరియ‌ల్ వ‌లే ముందుకు సాగుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో సెటైరిక‌ల్ టాక్ న‌డుస్తోంది. సచివాలయ నిర్మాణం ఆశించిన వేగంతో సాగనందున ఎప్పటికప్పుడు తేదీలను మార్చుకుంటూ వస్తున్న ప్రభుత్వం తాజాగా జులై  29వ తేదీని కూడా మార్పు చేయాలని నిర్ణయించింది. దీంతో పూర్తిస్థాయి ప‌రిపాల‌నపై స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది.

కొత్త రాజధానికి ఉద్యోగుల తరలింపు నిర్మాణాల జాప్యం కార‌ణంగా మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 29న పూర్తి స్థాయి సచివాలయం వెలగపూడికి రావలసిందేనని చెప్పిన ప్రభుత్వం మళ్లీ కొత్త తేదీల కోసం అన్వేషిస్తోంది. ఆగస్టు తొలి వారంలో తరలింపు కోసం అవసరమైన తేదీలను ప్రకటించాలని భావిస్తోంది.  ఈ వరుస మార్పులతో ఉద్యోగులు - అధికారులలో ఉత్కంఠ - ఆమోమయం నెలకొంటున్నాయి. ఇంతవరకు తరలింపునకు ఏడు దఫాలు తేదీలను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా కొత్త తేదీ కోసం చూస్తోంది. జూన్‌ 15వ తేదీని తొలి తరలింపు తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు శాఖలు కొత్త సచివాలయానికి వెళ్లినా వారంతా అదే రోజు వెనుదిరిగి హైదరాబాద్‌ వచ్చేశారు. వెలగపూడిలో నిర్మాణాల స్థాయిని బట్టి ఆగస్టు తొలివారంలో కొత్త తేదీలు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త తేదీలపై ఒకటి రెండు రోజుల్లో సర్కులర్‌ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News