ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ్య‌మా?:స‌్పెష‌ల్ ఫైట్

Update: 2015-08-10 15:45 GMT
మూడు పార్టీలు.. ఎన్నో వైరుధ్యాలు.. అంద‌రి త‌ప‌నా ఒక్క‌టే.. అంద‌రి ఆరాటం ఒక్క‌టే.. కానీ విధాన‌మే వేరు. అదే ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న‌. ఇస్తాన‌న్న బీజేపీ ఇవ్వ‌దు.. ఇదిగో..అదిగో అంటూ కాల‌హ‌ర‌ణం చేయ‌డ‌మే త‌ప్ప‌! ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు చాలు.. పదేళ్లు ఎందుకు దండ‌గ అన్న కాంగ్రెస్, విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణకే మ‌ద్ద‌తు ఇచ్చి, ఏపీ సంగ‌తి అస్స‌ల‌స్స‌లు ప‌ట్టించుకోని సీపీఐ, వీరంద‌రి క‌న్నా ప్ర‌త్యేకంగా పోరాడుతున్న విప‌క్ష నేత జ‌గ‌న్‌.. ఇవాళ‌.. ఇలా ఎవ‌రి వారే. ఉనికిని కాపాడుకునేందుకే పోరాటం. పొలిటిక‌ల్ మైలేజీ పెంచుకునేందుకే పోరాటం.
      
పోనీ పోరాటంలో ప‌ఠిమ ఉందా.. పోరాటంలో నిబ‌ద్ధ‌త ఉందా అంటే అదీ ప్ర‌శ్నార్థ‌క‌మే! ఈ త‌రుణంలో ముర‌ళీ మోహ‌న్, కొనక‌ళ్ల లాంటి టీడీపీ ఎంపీలు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. త‌మ రాజీనామాల వ‌ల్ల ప్ర‌త్యేక హోదా ద‌క్కుతుందంటే తామంతా త‌ప్ప‌క ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటామ‌ని ప‌దే ప‌దే బ‌ల్ల‌గుద్ది మ‌రీ! బలంగా చెబుతున్నారు. జూపుడి లాంటి నేత‌లైతే ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు రాజీప‌డ‌లేద‌ని, ఇప్ప‌టికీ ఆయ‌న కేంద్రాన్ని ఒప్పించే ప్ర‌య‌త్న‌మే చేస్తున్నార‌ని జ‌నాన్ని ఒప్పించేందుకు త‌న వంతు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజన సమయంలోనే ప్ర‌త్యేక హోదా అంశమై చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ఎంపీ కొనక‌ళ్ల ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌, వైస్సార్‌ సీపీలు ఏపీని మోసం చేశాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనకు అందరూ కలిసి రావాలని  కోరారు. అంతా కలిసి కేంద్రంపై ఒత్తిడిచేసి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు.
        
ఈ విషయంలో వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్, త‌మ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు.విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్‌ లో కాస్తో.. కూస్తో నాలుగు మాట‌లు మాట్లాడిన కొన‌క‌ళ్ల లాంటి వారు సైతం.. హోదా అంశంపై ఇవాళ పెద్ద‌గా పోరాడ‌లేక‌పోతున్నారు. ఆ రోజు.. తోటి ఎంపీలు చేసిన ముష్టిఘాతంతో.. మూకుమ్మ‌డి దాడితో తీవ్రంగా గాయ‌ప‌డి మృత్యుముఖం చూసి వ‌చ్చిన కొన‌క‌ళ్ల లాంటి వారు సైతం కేంద్రాన్ని దారిలోకి తెచ్చుకోలేక‌పోతున్నారు.పైగా ఆ రోజు టీడీపీ విప‌క్షం. కానీ ఇప్పుడు మిత్ర‌ప‌క్షం. అయినా బీజేపీ నేత‌ల కొమ్ములు వంచ‌లేక‌పోతుందే అన్న‌ది ఏపీ ప్ర‌జ‌ల బాధ‌.
    
ఇక బీజేపీ వెర్ష‌న్ మ‌రోలా ఉంది. ఏపీకి హోదా ద‌క్కిస్తే బీహార్‌, రాజ‌స్థాన్‌, ఒడిశా లాంటి రాష్ట్రాలు కూడాత‌మ‌కూ స్పెష‌ల్ స్టేట‌స్ కావాల‌ని ప‌ట్టుబ‌డ‌తాయ‌ని చెబుతోంది. అంతేకాదు 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌ను సాకుగా చూపుతోంది. కానీ.. తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామ‌న్ మాత్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు తాము సుముఖంగానే ఉన్నామ‌ని అంటారు. ఇదే విష‌య‌మై వెంక‌య్య వెర్ష‌న్ మాత్రం అస్స‌ల‌స్స‌లు పొంత‌న కుద‌ర‌కుండా ఉంది. పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్నందున ఈ విష‌య‌మై నో కామెంట్ అంటూ త‌ప్పించుకు తిరుగుతున్నారు.
         
జ‌గ‌న్ మాత్రం.. ఎప్ప‌టిలానే త‌న త‌ర‌హా రాజ‌కీయాల‌ను నెర‌పి, ఢిల్లీ పెద్ద‌ల‌ను ప్ర‌శ్నించ‌డంలో ఓ అడుగు ముందుకు, వంద అడుగులు వెనుక‌కు వేస్తూ.. విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంటున్నారు. ఇలా.. రాజ‌కీయ పార్టీల‌న్నీ ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌య‌మై.. త‌లో దారి ఎంచుకుంటూ.. ఢిల్లీ పెద్ద‌ల వెన్నులో వ‌ణుకు పుట్టించ‌లేక‌పోతున్నాయ్‌. సుజ‌నా లాంటి కేంద్ర మంత్రులైతే.. ప్ర‌త్యేక హోదా కాదు ప్ర‌త్యేక ప్యాకేజీ ద‌క్కినా అదే ప‌దివేలు అన్న చందంలో స్టేట్‌ మెంట్లు ఇస్తూ.. స్పెష‌ల్ స్టేట‌స్ అంశాన్ని అట‌కెక్కిస్తున్నారు. ఏదేమైనా ఏపీకి సంబంధించి రాజ‌కీయ పార్టీల‌న్నీ ఒకే తాటిపైకి వ‌స్తే.. క‌నీసం ఆశించిన స్థాయిలో నిధులైనా కేంద్రం నుంచి ద‌క్కే ఛాన్స్ ఉంది. లేదంటే.. ఇంతే సంగ‌తులు.. చిత్తగించ‌వ‌లెను అన్న‌ట్లే  రేప‌టి వేళ సీన్ రివ‌ర్స్ కాక‌మాన‌దు.
Tags:    

Similar News