బీజేపీ ఏపీ ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చిందా?

Update: 2022-08-02 09:33 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా అటూఇటుగా రెండేళ్ల స‌మ‌యం ఉంది. అయితే.. అప్పుడే రాజ‌కీయ ప‌రిణామాలు విశ్లేష‌కుల ఊహ‌కంద‌ని విధంగా మారిపోతున్నాయి. జ‌న‌సేన పార్టీలో పొత్తుతో ఉన్న బీజేపీ ఇటీవ‌ల రూటుమార్చిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో, బ‌హిరంగ స‌భ‌లో ఎక్క‌డా జ‌న‌సేనాని ప‌వ‌న్ కల్యాణ్, జ‌న‌సేన పార్టీ పేరు ఎత్త‌లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ఉమ్మ‌డి సీఎంగా అభ్య‌ర్థిగానూ ప్ర‌క‌టించ‌లేదు. దీంతో స‌హ‌జంగానే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీపై ఆగ్ర‌హంగా ఉన్నారని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ క‌లిసివ‌స్తే 2014లో మాదిరిగా క‌లిసి పోటీ చేయాల‌ని ప‌వ‌న్ అనుకున్నారు. అయితే.. బీజేపీ, టీడీపీ రెండూ ప్ర‌స్తుతానికి త‌మ సొంత విధానాల్లో ముందుకెళ్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల ముందు నరేంద్ర మోదీపై యుద్ధం ప్ర‌క‌టించి అన్ని రాష్ట్రాల్లో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగిన చంద్ర‌బాబు మ‌ళ్లీ బీజేపీ పంచ‌న చేరడానికి సిద్ధ‌మ‌వుతున్నారు. బీజేపీ పిల‌వాలే కానీ వెంట‌నే రెడీ అనేలా ఉన్నార‌ని వార్త‌లు వస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల్లో పాల్గొనాల‌ని చంద్ర‌బాబుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానం అందించింది. దీంతో చంద్ర‌బాబు ఆగ‌స్టు 6న ఢిల్లీకి ప‌య‌న‌మ‌వుతున్నారు. ఆ రోజు ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఇదే కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కూడా పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌తో ముచ్చ‌టించ‌డానికి చంద్ర‌బాబు అన్ని ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు. బీజేపీ సైతం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తోంది. వైఎస్సార్సీపీతో క‌ల‌వ‌డానికి అవ‌కాశం ఉన్నా దాన్ని ఒక అవినీతి పార్టీగానే బీజేపీ అధిష్టానం చూస్తుంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో ఒక‌టో, రెండో సీట్లు అయినా ద‌క్కించుకోవాలంటే త‌మ‌కు ఏదో ఒక ప్ర‌ధాన పార్టీ మ‌ద్ద‌తు కావాల‌ని బీజేపీ త‌ల‌పోస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీతో క‌ల‌సి వెళ్ల‌డానికి బీజేపీ సిద్ధ‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంటోంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల భీమ‌వ‌రంలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు చంద్ర‌బాబును కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానం అందింద‌ని గుర్తు చేస్తున్నారు. అయితే చంద్ర‌బాడు హాజ‌రుకాకుండా అచ్చెన్నాయుడిని ఈ కార్య‌క్ర‌మానికి పంపారు. అయితే వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అచ్చెన్నాయుడిని హాజ‌రు కానీయ‌కుండా అడ్డుకుంద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో మ‌రోమారు ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల్లో పాల్గొనాల‌ని చంద్ర‌బాబుకు కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ సంద‌ర్భంగా ఆగ‌స్టు 6న ఢిల్లీలో చంద్ర‌బాబు.. ప్ర‌ధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త‌దితరుల‌తో భేటీ అవుతార‌ని చెబుతున్నారు. బీజేపీ ఆలోచ‌న‌ల్లో వ‌చ్చిన మార్పుకు నిద‌ర్శ‌న‌మే చంద్ర‌బాబును ఆహ్వానించ‌డ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు కూడా బీజేపీకి దూర‌మ‌వ్వ‌డం వ‌ల్ల త‌మ‌కు కోలుకోలేని న‌ష్టం జ‌రిగింద‌నే భావ‌న‌లో ఉన్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ క‌ల‌యిక ఏ రూపు తీసుకుంటుందో ఆగ‌స్టు 6 వర‌కు వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News