స‌ల‌హా ఇచ్చిన వ్య‌క్తే నోట్ల ర‌ద్దును త‌ప్పుప‌ట్టేశారే

Update: 2016-11-22 06:46 GMT
అనిల్‌ బోకిల్... పుణెకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త. పెద్ద నోట్ల ర‌ద్దు స‌ల‌హా ఇచ్చింది ఈయ‌నే. 12 ఏళ్ల‌ క్రితమే ఈయన స్థాపించిన అర్థక్రాంతి ప్రతిష్ఠాన్ అనే మేథోసంస్థ ద్వారా త‌న ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌క్రియ కొన‌సాగిస్తున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో బోకిల్  పలుమార్లు తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ ఏడాది కూడా ఆర్థిక సర్వీసుల కార్యదర్శి హస్ముఖ్ అధియాతో కలిసి బోకిల్‌ తో సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ సమావేశం గురించి బాగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ముందు అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పన్ను రహిత ప్రతిపాదనలను బోకిల్ అందజేశారు. కానీ ఆయ‌న ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి చ‌ర్య‌ను త‌ప్పుప‌ట్టారు. ప్రధాని మోదీ ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా నోట్ల రద్దు అనే ఆపరేషన్‌ ను నిర్వహించారని వ్యాఖ్యానించారు.తమ సలహాలను రివర్స్ లో అమలు చేశారని పేర్కొన్నారు.

పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చర్య మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేయడంగా ప్రముఖ ఆర్థికవేత్త అనిల్‌బోకిల్ అభివర్ణించారు.  రోజుకు 100 రూపాయల సంపాదన మీద ఆధారపడే భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోట్ల అవసరం లేదని, రూ.50 నోటే పెద్ద నోటుగా ఉండాలని బొకిల్‌ చెప్పారు. నోట్ల చెలామణీ రద్దును ఆయన కరెన్సీ అణచివేతగా పేర్కొన్నారు. తాము చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రతిపాదన మార్కెట్‌ లో రూ.50 నోటు అతిపెద్ద డినామినేషన్‌ గా చెలామణీలో ఉంటుందన్న ఉద్దేశంతోనేనని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నగదు రహితంగా మారాలని తామేమీ చెప్పబోవడం లేదని బోకిల్ అన్నారు. "కొంత నగదు మార్కెట్‌ లో ఉండాల్సిందే. అయితే.. రూ.50 నోటుకు అది పరిమితం కావాలి. దాదాపు 70శాతం జనాభా రోజుకు సుమారు వంద రూపాయల మీదే జీవనం సాగిస్తున్నటువంటి భారత్‌ లాంటి దేశాల్లో రూ.100 నోటుకు మించిన కరెన్సీ అవసరం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు.

ఇదిలాఉండ‌గా అర్థక్రాంతి ప్రతిపాదనల్లో మొదటి అంశం కస్టమ్స్ - దిగుమతి సుంకాలు మినహా ప్రస్తుతం ఉనికిలో ఉన్న అన్ని రకాల పన్నుల వ్యవస్థను ఉపసంహరించాలి. బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలపైనే పన్ను విధించాలి. అంటే.. నగదు జమ/ఉపసంహరణ మూలం వద్దే సింగిల్‌పాయింట్ పన్ను ఉంటుందన్నమాట. మూడవది నగదు లావాదేవీలపై ఎలాంటి పన్ను ఉండకూడదు. నాలుగవది పెద్ద డినామినేషన్ నోట్ల రద్దు. అయితే.. మోదీ నాలుగో అంశాన్ని మొదట అమలు చేశారు అని బోకిల్ వివరించారు. మోదీ ప్రకటన నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతాయని మీరు భావించారా? అన్న ప్రశ్నకు.. "తాను ముందే చెప్పినట్టు ఈ ఆపరేషన్‌ ను మత్తు మందు ఇవ్వకుండా నిర్వహించారు. ఇది ఎప్పుడైనా నొప్పి కల్గిస్తూనే ఉంటుంది" అని బోకిల్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News