హైదరాబాద్ లోని మరో పబ్ లో బడా బాబుల పిల్లల అసభ్య రచ్చ!

Update: 2022-06-21 09:32 GMT
ప్లాన్ ప్రకారం పబ్ లో పరిచయం చేసుకొని మాయ మాటలతో బేకరీ వద్దకు తీసుకెళ్లి.. అనంతరం ఇంటి దగ్గర వదులుతామని చెబుతూ ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతంతో చోటు చేసుకున్న రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి దాదాపు రెండు వారాల పాటు సాగిన హడావుడి.. మొన్నటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చోటు చేసుకున్న విధ్వంసకాండతో తెర వెనక్కి వెళ్లటం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని స్టార్ హోట్ లోని పబ్ లో ఒక యువతికి ఎదురైన లైంగిక వేధింపులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

మీడియాలో అంతగా ఫోకస్ కాని ఉదంతం.. రానున్న రోజుల్లో మరింత సంచలనంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బడా బాబుల పిల్లలు ఈ ఉదంతంలో నిందితులుగా చెబుతున్నారు. ఒక యువతిని టార్గెట్ చేసిన ఎనిమిది మందితో కూడిన గ్రూపు.. అదే పనిగా ఆ అమ్మాయి వద్దకు వెళ్లటం.. ఆమె ఫోన్ నెంబర్ ను కనుక్కునేందుకు ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు.

స్టార్ హోటల్ లోని రూఫ్ టాప్ లో ఉన్న పబ్ లాంజ్ లో జరిగిన ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలో బాధితురాలు తన ఇద్దరు స్నేహితురాలతో కలిసి పబ్ కు వెళ్లినట్లుగా చెబుతున్నారు. పబ్ లో ఉన్న ఆమె వద్దకు వెళ్లిన నిందితులు.. ఫోన్ నెంబరు కోసం పదే పదే అడిగినట్లుగా చెబుతున్నారు.

అయితే.. బాధితురాలు తన ఫోన్ నెంబరును ఇచ్చేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో గ్రూప్ లోని ఇద్దరు కుర్రాళ్లు బాధితురాలిని పక్కకు తీసుకెళ్లి.. అసభ్యంగా వ్యవహరించారు. ఫోన్ నెంబరు ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో బాధితురాలికి సాయంగా వచ్చిన స్నేహిరాలిపై మద్యం సీసాలతో యువకులు దాడి చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. నిందితుల్లో పలువురు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారిగా చెబుతున్నారు. దీనిపై కేసు నమోదైందన్న వాదనలు వినిపిస్తుంటే.. దీనిపై అధికారిక సమాచారం ఏదీ మంగళవారం మధ్యాహ్నం వరకు బయటకు రాలేదు. ఈ ఉదంతంలో బడా బాబుల పిల్లలతో పాటు.. ఒక సీనియర్ పోలీసు అధికారి కుమారుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసులు దీనిపై వివరాలు అందిస్తేనే మరిన్ని వివరాలకు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News