మయన్మార్లో మళ్లీ ఘోరం, 114 మందిని చంపేశారు - ఐరాస ఎంట్రీ

Update: 2021-03-28 05:30 GMT
దేశ‌మంటే మ‌ట్టి కాదోయ్‌.. మ‌నుషులోయ్ అన్నారు గురజాడ‌. కానీ, మ‌న పొరుగునే.. మ‌న దేశ స‌రిహ‌ద్దుతో భాగం పంచుకునే దేశంలో  మాత్రం దేశమంటే మ‌నుషులు కాదు.. శ‌వాలే!! వినేందుకు ఒకింత బాధ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. నిజం. కేవ‌లం రెండు నెల‌ల్లోనే ఈ దేశంలో వెయ్యి మందికి పైగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కాల్చి చంపారు. అది కూడా అత్యంత దారుణంగా. అంతేకాదు... ఇలా కాల్చి చంపిన వారి ఫొటోల‌ను మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేస్తున్నారు. ఎందుకంటే.. మిగిలిన వారిని కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించేందుకేన‌ట‌!  మ‌రి ఇంత దారుణ‌మైన దేశం ఉంటుందా? అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న పాల‌కులు ఎక్క‌డైనా ఉంటారా?  అంటే.. ఉన్నారు.

అధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఈ సంఖ్య 400-500 మధ్య ఉండ‌గా.. అన‌ధికారికంగా ఈ సంఖ్య 1000 పైనే ఉంటుంద‌ని మీడియా వెల్ల‌డించింది. అదే.. మ‌య‌న్మార్‌. మ‌న పొరుగునే ఉన్న పాత బ‌ర్మా దేశం. ప్ర‌జాస్వామ్యం ప‌రిఢ‌విల్లిందిలే.. అని అనుకుని .. ప్ర‌పంచ దేశాలు మురిసిపోయిన మ‌య‌న్మార్‌లో ఇప్పుడు రెండు మాసాలుగా సైనిక నియంత‌లు రాజ్య మేలుతున్నారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని ప‌క్క‌న పెట్టి.. అధికారం చేజిక్కించుకున్న మ‌య‌న్మార్ సైనిక నియంత‌లు.. ప్ర‌జ‌ల‌పై క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించారు.

సైనిక పాలనకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న వారిని.. సైన్యం, పోలీసులు పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తున్నారు.  సైన్యం ఓ వైపు 76వ‌ ఆర్మీ డే ఉత్సవాలు జరుపుకొంటూనే.. ఆందోళనకారులపై తుపాకీ ఎక్కు పెట్టింది. వివిధ నగరాల్లో కేవ‌లం 24 గంట‌ల్లోనే 114 మందిని కాల్చి చంపింది. డజన్ల కొద్దీ ఆందోళనకారులు క్షతగాత్రులయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. శనివారం ఉదయం 50 మరణాలు నమోదవ్వగా.. సాయంత్రం 4 గంటలకు ఆ సంఖ్య 74కు.. ఆరు గంటలకు 91కి పెరిగింది. ఓ వైపు ప్రభుత్వ టెలివిజన్‌లో సైన్యాధ్యక్షుడు జుంటా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘ప్రజలకు ఎలాంటి అపాయం జరగకుండా మిలటరీ అండగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంది’’ అని ప్రకటించగా.. మరోవైపు సైనికులు, పోలీసులు ఆందోళనకారులపై తుపాకీలతో విరుచుకుపడ్డారు.

ఈ నెల 14న కూడా సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 74 మంది మృతిచెందారు. ఆ ఘటనను నిరసిస్తూ.. శనివారం ప్రజలంతా రోడ్లెక్కారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా పోలీసులు, సైనికులు.. వారిపై కాల్పులు జరిపారు. ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసిన మయన్మార్‌ సైన్యం.. దేశాన్ని, పరిపాలనను తమ అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి సైనిక పాలన వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి. ఇప్పటి వరకు ఆందోళనకారుల అణచివేతకు సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 1000కు పైగా మృతిచెంది ఉంటారని స్థానిక మీడియా, న్యాయవాదులు చెబుతున్నారు. అయితే.. సైనిక పాలకులు మాత్రం ఈ ఘటనలపై నోరు మెదపడం లేదు. ఈ చర్యలను పదవీచ్యుతులైన చట్టసభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఈ ఘటనలు సైన్యానికి సిగ్గుచేటని జుంటాకు వ్యతిరేకంగా ఏర్పడ్డ చట్టసభ్యుల బృందం (సీఆర్‌పీహెచ్‌) ప్రతినిధి డాక్టర్‌ సెసా మండిపడ్డారు. మయన్మార్‌లో ఊచకోతపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శనివారం నాటి ఘటనపై సైన్యాధ్యక్షుడిలో పశ్చాత్తాపం లేకపోగా.. అధికారిక టీవీ చానల్‌ ఎంఆర్‌టీవీ ద్వారా పరోక్ష హెచ్చరికలు చేయిస్తున్నారు. ‘‘యువకులారా.. ఆందోళనల్లో ముందున్న వారు చనిపోయారు. వారి తలల్లో, వీపు భాగాల్లో బుల్లెట్లు దూసుకుపోయాయి. దీని నుంచి గుణపాఠం నేర్చుకోండి’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనలు చేస్తే.. వారికి పట్టిన గతే మీకూ పడుతుందంటూ పరోక్షంగా హెచ్చరించారు. ప్ర‌స్తుతం మ‌య‌న్మార్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌పై చ‌ర్చించేందుకు ఐక్య‌రాజ్య‌స‌మితి శాంతి బృందం హుటాహుటిన భేటీ అయింది. మ‌రి ఏం చేస్తుంద చూడాలి.
Tags:    

Similar News