ట్రంప్ కు మరో షాక్.. అరెస్ట్ వారెంట్

Update: 2021-01-07 14:44 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏది కలిసిరావడం లేదు. మొన్ననే ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఇప్పుడు కుర్చీ దిగేందుకు ససేమిరా అంటూ తన మద్దతుదారులతో ఏకంగా అమెరికన్ పార్లమెంట్ పైనే దాడికి ఉసిగొల్పాడని అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఇక జనవరి 20న దిగిపోతున్న ట్రంప్ కు తాజాగా మరో షాక్ తగిలింది.

ఇరాన్ సైనికాధికారి హత్య కేసులో తాజాగా డొనాల్డ్ ట్రంప్ కు ఇరాక్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేయడం సంచలనమైంది. జనరల్ ఖాసిమ్ సులేమాని, అబు మహదీ అల్ ముహండీస్ లను అమెరికా సైన్యం డ్రోన్ దాడులతో హతమార్చిన కేసులో దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జి ఆదేశించారు.

అబూమహదీ అల్ ముహండిస్ కుటుంబం నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత వారెంట్ జారీ చేస్తామని.. హత్యలపై దర్యాప్తు కొనసాగుతుందని సుప్రీం జ్యూడీషియల్ కౌన్సిల్ గురువారం వెల్లడించింది.

గత ఏడాది జనవరి 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశానుసారం బాగ్దాద్ లో ఇరాక్ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ తోపాటు 47మంది ఇతర అమెరికన్ అధికారులను అదుపులోకి తీసుకునేందుకు సహకరించాలని ఇప్పటికే ఇరాన్ ఇంటర్ పోల్ ను కోరింది.

ట్రంప్ అధ్యక్షుడిగా వైదొలిగినా సరే తాము ఆయనను వదిలేది లేదని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.




Tags:    

Similar News