కేటీఆర్‌ కు వ్య‌తిరేకంగా ఆటోతో ఊరూరి ప్ర‌చారం

Update: 2018-10-25 06:36 GMT
తెలంగాణ అప‌ద్ధ‌ర్మ‌ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌ కు త‌న సొంత ఇలాకా అయిన సిరిసిల్లాలోనే గ‌డ్డుకాలం ఎదుర‌వుతోందా? వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్న నేత‌న్న‌ల న‌గ‌రంలో ఈ ద‌ఫా ఊహించ‌ని వ్య‌తిరేక‌త‌ను ఆయ‌న ఎదుర్కోవాల్సి వ‌స్తుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఏకంగా ఆయ‌న‌కు వ్య‌తిరేక ప్ర‌చారం నిర్వ‌హించేందుకు ప్ర‌త్యేకంగా ఆటోలు ఏర్పాటు చేసుకొని మ‌రీ ఊరూరా తిరిగేందుకు ప‌లువురు ప‌ర్య‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మంత్రి కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలోని నేరెళ్ల‌లో ఇసుక అక్ర‌మ ర‌వాణ లారీల వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదానికి గురై ప‌లువురు మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఇటు టీఆర్ఎస్‌ను అటు కేటీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసింది. ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ అవి త‌మ‌కు న్యాయం చేసే విధంగా లేవ‌ని బాధితులు ప‌లు సంద‌ర్భాల్లో ఆరోపించారు. ఇలా కొన‌సాగుతున్న వివాదం తాజాగా మ‌లుపులు తిరిగింది. నేరెళ్ల ప్ర‌మాద బాధితులు పెంట బాణయ్య, కోలా హరీశ్ ఆటోకు ఫ్లెక్సీలు కట్టి నియోజ‌క‌వ‌ర్గంలోని బద్దెనపల్లి, రామన్నపల్లి, బస్వాపూర్‌ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నేరేళ్ల ఘటనలో బలైన ఆరుగురికి న్యాయం చేయలేని కేటీఆర్‌ నియోజకవర్గ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తమను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని గుర్తు చేశారు. ఘటన జరిగిన 50 రోజులకు పరామర్శించిన ఆయన ఆదుకుంటామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా పట్టించుకోలేదని వాపోయారు. ఘటనలో బాధ్యులైన పోలీసులపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కమిషన్‌ మెంబర్‌ రాములు నేరేళ్ల బాధితులకు ఐదెకరాల భూమి, రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు గుర్తు చేశారు. వారం రోజలుగా న్యాయ పోరాట దీక్షలు చేసినా ఏ ఒక్క టీఆర్‌ఎస్‌ నేత కూడా స్పందించకపోవటం అధికారం ఉందనే అహంకారం తప్ప మరేమీ కాదన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకూ టీఆర్‌ ఎస్‌ కు వ్యతిరేకంగా గ్రామగామానా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, ఈ ఆందోళ‌న మ‌రో మ‌లుపు తిరిగింది. అనుమతి లేకుండా నేరెళ్ల బాధితులు ప్రచారం నిర్వహిస్తున్నారని పోలీసులతో టీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీనికి పోలీసు స్పందిస్తూ...అనుమతులు లేకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో నేరేళ్ల బాధితుల ప్రచార ఆటోను పోలీసులు అడ్డుకున్నారు. 'మీరు న్యాయం కోసం ప్రచారానికి దిగితే ముందుగా ఆర్డీఓ - పోలీసుల అనుమతి పొందాలి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'అని పోలీసులు హెచ్చరించారు. నేరేళ్ల బాధితులు ప్రచారం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని వారిని గ్రామ శివారులోకి తీసుకెళ్లి కేటీఆర్‌ వెళ్లేంత వరకూ వారిని అక్కడే నిలిపేశారు.
Tags:    

Similar News