ఆయన్ను ‘ఎయిర్ పోర్ట్’ అరెస్ట్ చేశారా?

Update: 2016-04-11 05:16 GMT
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ మధ్యన రాజకీయాంశాల్ని తరచూ ప్రస్తావిస్తున్నారు. జాతీయవాదంపై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లోకి వస్తున్న అనుపమ్.. ఆదివారం జమ్మూ కశ్శీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ కు వెళ్లటం తెలిసిందే. శ్రీనగర్ లోని ఎన్ ఐటీ క్యాంపస్ కు వెళ్లాలని.. అక్కడ ఆందోళన చేస్తున్న నాన్ లోకల్ (ఇతర రాష్ట్రాల  విద్యార్థులు) విద్యార్థుల్ని కలిసి.. వారితో భేటీ కావాలని భావించారు.

అయితే.. అనుపమ్ ఖేర్ ను భద్రతా సిబ్బంది ఎయిర్ పోర్ట్ బయటకు రానివ్వలేదు. ఆయన కానీ క్యాంపస్ వెళితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారతాయని చెప్పి.. ఆయన్ను బయటకు అనుమతించలేదు. ఈ సందర్భంగా తనను శ్రీనగర్ లోకి అనుమతించకుండా ఉండే ఆదేశాల్ని చూపించాలని అనుపమ్ వాదన పెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఇదిలా ఉంటే.. తన పూర్వీకులు నివసించిన ఇంటిని.. కనీసం ఖీర్ భవానీ గుడికి అయినా తనను అనుమతించాలని కోరినా.. వారు ససేమిరా అనటం గమనార్హం.

క్యాంపస్ కు వెళ్లి విద్యార్థులకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలన్నదే తన ఉద్దేశం తప్పించి.. గొడవలు పెంచటం తన వైఖరి కాదని చెప్పినా భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. చివరకు.. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో జాతీయ జెండాను ప్రదర్శించి.. వేరే విమానంలో ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తనను ఎయిర్ పోర్ట్ అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. ఫర్లేదే శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో అయినా త్రివర్ణ పతాకాన్ని అనుపమ్ ఖేర్ ప్రదర్శించగలిగారే..?
Tags:    

Similar News