ఆ మహిళా కేంద్ర‌మంత్రిపై పోలీస్ కేసు

Update: 2016-08-08 09:28 GMT
కేంద్ర మంత్రి అయ్యాక తొలిసారి సొంత రాష్ట్ర రాజధాని నగరానికి వచ్చిన ఆ మహిళా మంత్రి పోలీసు కేసులో చిక్కుకున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా స‌హాయ మంత్రి అనుప్రియా ప‌టేల్‌ పై ఆదివారం ల‌క్నో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని మీర్జాపూర్‌ కి ఎంపిగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఆమె మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశాక తొలిసారి రాష్ట్ర‌ రాజ‌ధాని ల‌క్నో వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమెకి ఆహ్వానం ప‌లికేందుకు ఎయిర్‌పోర్టు వ‌ద్ద పెద్ద ఎత్తున జ‌నం గుమిగూడారు. అంతేకాక ఆమె ఎయిర్‌ పోర్టునుండి బ‌య‌లుదేరిన త‌రువాత కూడా 200కి పైగా కార్లు ఆమె కాన్వాయ్‌ని అనుస‌రించాయి.  ఆమె ప్రయాణించే మార్గ‌మంతా కార్ల‌తో నిండిపోవ‌టంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

దాంతో వాహ‌న‌దారులు రెండు గంట‌ల‌పాటు ట్రాఫిక్‌ లో చిక్కుకున్నారు. 400మీట‌ర్ల పొడ‌వున మంత్రిగారి వాహ‌నాలు ఆగిపోవ‌టంతో వాహ‌న‌దారులు ముందుకు వెళ్లే అవ‌కాశం లేక‌పోయింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఈ సంఘ‌ట‌న చోటు చేసుకోగా ఆదివారం అనుప్రియా ప‌టేల్ ఆమె అనుచ‌రుల‌పై హ‌జ్ర‌త్ గంజ్ పోలీస్ స్టేష‌న్‌ లో ఎఫ్ ఐఆర్ న‌మోదైంది. ప‌టేల్ రావ‌టం వ‌ల‌న ల‌క్నోవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని హ‌జ్ర‌త్ గంజ్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌ ఛార్జ్ కేసు నమోదు చేశారు.

కాగా కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా ఆమె అనుచరులు నిర్వ‌హించిన ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమ‌తి  తీసుకోలేద‌ని పోలీసులు చెబుతున్నారు.  ప‌టేల్ ప‌ర్య‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చెల‌రేగ‌కుండా విధాన్ భ‌వ‌న్ మార్గ్‌ లో 144 సెక్ష‌న్ విధించాల్సి వచ్చింద‌ని పోలీసులు చెబుతున్నారు.  ప‌టేల్, 150 వాహ‌నాల్లో ఉన్న ఆమె అనుచ‌రుల‌పై  ప్రజలకు ఇబ్బంది కలిగించారన్న అభియోగాల‌తో కేసు న‌మోదు చేశారు. అయితే.. కేంద్రంతో తలపడుతున్న యూపీలోని సమాజ్ వాది పార్టీ కావాలనే తమ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రిపై కేసు పెట్టిందని అప్నాదళ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Tags:    

Similar News