వామ్మో.. ఒక్క కారుకే 182 చ‌లానాలు

Update: 2015-08-24 10:16 GMT
చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న లేక‌పోతే ఎంత‌టి ప్ర‌మాద‌మ‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. పార్కింగ్ ప్లేస్ విష‌యంలో ఎన్నో ఇబ్బందులున్న హైద‌రాబాద్‌లో షాపింగ్ కోసం కానీ.. ఆసుప‌త్రి అవ‌స‌రాల‌కు.. మ‌రే ఇత‌ర అవ‌సరాల కోసం వెనుకా ముందు చూసుకోకుండా కారును పార్కింగ్ చేసి వెళ్లిపోవ‌టం.. తాపీగా ప‌ని పూర్తి చేసుకొచ్చి ఇంటికి వెళ్లిపోయేవారు చాలామందే. అంత‌దాకా ఎందుకు సినిమా టిక్కెట్ల కోసం కూడా చాలామంది రోడ్డు మీద అలా కారు పెట్టేసి.. వ‌చ్చేస్తుంటారు.

కానీ.. వాహ‌న య‌జ‌మానులు అలా త‌మ ప‌నిలో తాము ఉన్న‌స‌మ‌యంలోనే.. ట్రాఫిక్ పోలీసులు వ‌చ్చేసి.. కెమేరాతో నెంబ‌ర్ ప్లేట్ ను ఫోటో తీసేసుకెళ్లి పోతుంటారు. య‌జ‌మానులు ఏ ర‌కంగా అయితే.. అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయాం అనుకుంటారో.. అదే రీతిలో గ‌మ్ముగా వ‌చ్చే ట్రాఫిక్ పోలీసులు.. త‌మ కెమేరాల‌తో ఫోటోలు తీసుకొని పోతారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌న్న‌ట్లుగా స‌ద‌రు ఫోటోలు కాస్తా చ‌లానాలుగా మారిపోతాయి.

ఈ విషయాల‌పై అవ‌గాహ‌న లేని వారికి ఎప్పుడో ఒక‌సారి బ‌య‌ట‌ప‌డుతుంటాయి. చాలామంది త‌మ వాహ‌నాల మీద ఎన్ని చ‌లానాలు ఉన్నాయ‌న్న విష‌యాన్ని తెలుసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌నిపించరు. న‌గ‌రంలో ఎన్నో అవ‌స‌రాల కోసం వాహ‌నాల్ని రోడ్డు మీద‌కు తేవ‌టం.. అప్ప‌టికున్న అవ‌స‌రాలకు త‌గ్గ‌ట్లుగా ఎక్క‌డో ఏదో త‌ప్పు చేయ‌టం.. అది కాస్త కెమేరా క‌న్నుతో చ‌లానా రూపంలో బుక్ అయిపోతుంటాయి.

తాజాగా అలాంటి పెండింగ్ చ‌ల‌నాల మీద పోలీసులు దృష్టి సారించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో అత్య‌ధికంగా చ‌లానాలు పెండింగ్ ఉన్న వారి వివ‌రాలు చూసిన‌ప్పుడు ఆశ్చ‌ర్యంతో నోట మాట రాని ప‌రిస్థితి. ఎందుకంటే.. ఏపీ 28 డీబీ 8179 నెంబ‌రున్న హుందాయ్ ఐ20 కారు మీద అత్య‌ధికంగా 182 ఈ చ‌లానాలు పెండింగ్‌లో ఉన్న‌ట్లు తేలింది. ఈ వాహ‌నం డాక్ట‌ర్ రేవ‌తి పేరు మీద ఉన్న‌ట్లు తేలింది. ఈ కారుకు సంబంధించి 150 చ‌లానాలు కేవ‌లం మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్‌ప‌రిధిలో ఉన్న‌ట్లు తేలింది. అది కూడా రాంగ్ పార్కింగ్‌కు సంబంధించే చ‌లానాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

అవ‌గాహ‌న లేక‌పోవ‌టం కానీ.. స్థ‌లం లేక‌.. స‌ద‌రు య‌జ‌మాని త‌న కారును స‌రైన ప్లేస్ లోనే పెడుతున్నాన‌ని భావించి ఉండొచ్చు. కానీ.. ఆమెకు అవ‌గాహ‌న లేకున్నా.. ట్రాఫిక్ పోలీసులు త‌మ బాధ్య‌త‌ను తాము నిర్వ‌ర్తించ‌టంతో ఈ అత్య‌ధిక చ‌లానాలున్న కారుగా తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ భారీ ఈ చ‌లానా పెండింగ్ తో మొత్తం జ‌రిమాన మొత్తం రూ.41,470గా తేల్చారు. ఒక వాహ‌నం మీద ఈ చ‌లానా కింద అత్య‌ధికంగా జ‌రిమానా ఉన్న కారు ఇదేన‌ని పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. త‌ర్వాతి స్థానంలో ఏపీ11 జెడ్ 2848 నెంబ‌రున్న ఆర్టీసీ బ‌స్సు. దీని మీద మొత్తం 97 ఈ చ‌లానాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ 97 చ‌లానా జ‌రిమానా మొత్తం రూ.29,395గా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో.. హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులు.. త‌మ త‌మ వాహ‌నాల్ని ఎక్క‌డ పార్క్ చేస్తున్నార‌న్న విష‌యాన్ని ఒక‌టికి రెండుసార్లు చూసుకొని నిలిపితే మంచిది. లేకుంటే మ‌న‌కు తెలీకుండానే చ‌లానాలు భారీగా రెఢీ కావ‌టం ఖాయం. సో.. బీకేర్‌ఫుల్.
Tags:    

Similar News