బ‌ట‌న్ నొక్కినప్పుడల్లా సంఖ్య త‌గ్గిపోతోంది: టీడీపీ ఆగ్ర‌హం

Update: 2022-05-18 02:30 GMT
''దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 2022 ఖరీఫ్‌ పంటకు పెట్టుబడిగా వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందిస్తున్నాం. ఇప్పుడు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన వెంటనే ప్రతి రైతుకూ రూ.5500 నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి'' అని  ఏలూరు జిల్లా గణపవరంలో సీఎం జగన్  వైఎస్సార్‌ రైతు భరోసా ప‌థ‌కానికి సంబంధించి బటన్  నొక్కారు. 'రైతు భరోసా' నిధులను విడుదల చేశారు. కానీ.. ఏకంగా 2.28 లక్షల మంది రైతులకు 'భరోసా'ను ఎగరగొట్టారు.

ఇదే విష‌యాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఆదిరెడ్డి అప్పారావు ఎత్తి చూపారు. ప‌థ‌కాల అమ‌లులో భాగంగా జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కిన ప్రతిసారీ.. ల‌బ్ది దారుల సంఖ్య త‌గ్గిపోతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 2022 ఖ‌రీఫ్‌కు పెట్టుబ‌డి సాయంగా రైతు భ‌రోసా ఇస్తున్నామ‌ని.. త‌ద్వారా ప్ర‌తి రైతు బ్యాంకు ఖాతాలోనూ రూ.5500 జ‌మ అవుతాయ‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే.. గ‌ణ‌ప‌వ‌రంలో జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్క‌గానే 2.28 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ఎగ్గొట్ట‌డం అన్యాయ‌మ‌ని అప్పారావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌తంలో జ‌గ‌న్ ఏం చెప్పారు?

రైతుల‌ను ఆదుకునేందుకు రాజ‌న్న రాజ్యం ఏర్ప‌డింద‌ని ప‌దే ప‌దే చెప్పిన సీఎం జ‌గ‌న్‌.. వైఎస్సార్ రైతు భ‌రోసా  పథకం కింద 64.07 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంద‌న్నారు. వీరిలో 15.37లక్షల కౌలురైతు కుటుంబాలు కూడా ఉన్నాయని  2019-20 వ్యవసాయ బడ్జెట్ స‌మ‌యంంలో పేర్కొన్నారు. కానీ... ఈ సంవత్సరం మొత్తం రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య 50.10 లక్షలకు పడిపోయింది. ఇందులో భూమి ఉన్న రైతు కుటుంబాలు 47.85 లక్షలు కాగా, అటవీ భూమి హక్కుదారులు 92 వేల మంది, కౌలు రైతులు లక్షా 43 వేల మందికే రైతు భరోసా వర్తింపచేస్తోంది.

2021-22లో 52.38లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఆ సంఖ్య 50.10లక్షలకు తగ్గింది. అంటే... ఏడాదిలో 2.28లక్షల మందికి భరోసా లేకుండా చేసింది. వీరిలో 1.43 లక్షల మంది కౌలు రైతులే అని అధికారిక గణాంకాల ద్వారానే తెలుస్తోంది. రైతు భరోసాలో కోతలకు కారణమేమిటో ప్రభుత్వం అధికారికంగా చెప్పడంలేదు. భూమి ఖాతా ఉన్న రైతు  చనిపోయినా, లబ్ధిదారులు జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లిస్తున్నా, ఒకే రేషన్‌ కార్డులో ఇద్దరు రైతులు ఉన్నా,  రైతు కుటుంబంలో ఉన్నత విద్య చదువుతున్నా, నవరత్నాల్లోని పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్నా... రైతు భరోసాను నిలిపివేసినట్లు తెలిసింది. దీని ఫలితంగానే ఈ ఏడాది 2.28లక్షల రైతు కుటుంబాలు 'భరోసా'కు దూరమయ్యాయి.
Tags:    

Similar News