రాజకీయాల ట్రెండ్ ఇపుడు బాగా మారిపోయింది. ఏం చేసినా కూడా అంతా కూడా ప్రసాదం మీద భక్తి మాత్రమే. జనాలు దేవుళ్ళు అని చెబుతున్నా వారి ఓట్ల కోసం పాకులాట ఎక్కువగా ఉంటోంది. వీటికి ఎవరూ అతీతులు కారు. అలా చూస్తే కనుక అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఇదే విధంగా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటోంది. మూడేళ్ళ పుణ్య కాలం గడచిపోయింది. హామీలు చాలా చేశామని చెబుతున్నా అందులో కొన్ని ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఆయా సెక్షన్లు కూడా వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.
వారిని కూడా అక్కున చేర్చుకునేందుకు జగన్ ఇపుడు పావులు కదుపుతున్నారు. తన మానసపుత్రిక అయిన సచివాలయం ఉద్యోగులకు జగన్ ఇపుడు ఒక అతి పెద్ద వరం ఇచ్చారు. వారిని అసలైన ప్రభుత్వ ఉద్యోగులను చేస్తున్నారు. ఇన్నాళ్ళూ గొడ్డు చాకిరి చేసినందుకు వారికి తగిన ప్రతిఫలం ఇపుడు దక్కబోతోంది. ప్రోబేషన్ డిక్లరేషన్ మీద జగన్ సంతకం చేశారు. దాంతో కచ్చితంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు న్యాయం జరగనుంది. అలాగే వారికి కొత్త్త పీయార్సీ కూడా అమలు అవుతుంది.
ఒక విధంగా వారిని ఖుషీ చేసే ప్రయత్నం ఇది అని అంటున్నారు. ప్రభుత్వానికి ముఖ్యంగా ఖజానాకు ఇది అతి పెద్ద ఆర్ధిక భారం అంటున్నారు. మరి జగన్ ఎందుకు ఇంత సాహసం చేస్తున్నారు అంటే ఎన్నికలు ఎపుడు వచ్చినా ఆ వర్గాల నుంచి మెప్పు పొందడానికే అని అంటున్నారు. దాదాపుగా అయిదు లక్షల ఓట్లుగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.
దాంతో వారి కోరిక తీర్చిన దేవుడిగా జగన్ కనిపించాలనుకుంటున్నారు. ఇక వీరితో పాటే తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక గుడ్ న్యూస్ జగన్ చెప్పబోతున్నారు అని అంటున్నారు. సీపీఎస్ కోసం వైసీపీ సర్కార్ తో దాదాపుగా పోరాడుతున్న ఉద్యోగులకు జగన్ మధ్యేమార్గంగా ఒక మంచి మాట చెబుతారు అని తెలుస్తోంది.
ఈ మధ్యన శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు జగన్ వెళ్లినపుడు ఒక మాట అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు గత పాలకులు ఏ మేలూ చేయలేదని, వారికి ఊహకు కూడా అందని విషయాలను తాము చేయబోతున్నామని. అయితే ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కూడా ఆరోపించారు. అంటే సీపీఎస్ విషయంలో నాడు టీడీపీ పూర్తి మౌనం దాల్చిందని, దాన్ని టేకప్ చేసి హామీ ఇచ్చామని జగన్ అంటూనే ఇపుడు దాన్ని వేరే విధంగా అమలు చేస్తామని చెబుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోకుండా తాము అన్ని మార్గాలూ చూస్తున్నామని ఆయన చెప్పడం వెనక జీపీఎస్ ప్లాన్ ఉందని అంటున్నారు. అంటే గ్యారంటీ పెన్షన్ స్కీం అన్న మాట. అటు పాత పెన్షన్ విధానం కాకుండా ఇటు సీపీస్ కాకుండా జీపీఎస్ ని అమలు చేయడం ద్వారా 13 లక్షల మంది దాకా ఉన్న సర్కారీ ఉద్యోగుల మన్ననలు పొందాలని జగన్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు పలు మార్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు దఫదఫాలుగా జరుపుతోంది. ఇవి కనుక ఒక కొలిక్కి వస్తే జీపీఎస్ ని ప్రకటిస్తారు అని అంటున్నారు. మొత్తానికి కొద్ది నెలల వ్యవధిలోనే ఈ ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన మరికొన్ని హామీలను తీర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
వీటితో పాటు తాను ఎన్నికల్లో చెప్పిన వాటిని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మరికొన్ని కీలకమైన హామీల మీద కూడా జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం కొద్ది నెలలలోనే ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ఒక్క పక్కా ప్రణాళిక ప్రకారం పెండింగ్ ఇష్యూని వరసబెట్టి పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు అని అంటున్నారు
ఈ ఏడాది చివరికి ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, పార్టీపరమైన రాజకీయ ఇబ్బందులను కూడా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది మొదటి నెలకు పూర్తి పెర్ఫెక్ట్ గా ఉంటే ఆ మీదట ఏపీలో అతి పెద్ద రాజకీయ సంచలనానికి వైసీపీ తెర తీసినా తీయవచ్చు అంటున్నారు. అదే అందరి నోట్లో నానుతున్న ముందస్తు ఎన్నికల వ్యవహారం అన్న మాట. చూడాలి మరి.