టీ బ‌స్ లో కాల్పులు!...ఏపీ ఖాకీ ప‌ని అంట‌!

Update: 2019-05-02 13:50 GMT
భాగ్య న‌గ‌రి హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలోని సెంట‌ర్ పాయింట్ పంజాగుట్ట‌లో నేటి ఉద‌యం పెను క‌ల‌క‌ల‌మే రేగింది. నిండా జ‌నంతో ప‌రుగులు పెడుతున్న తెలంగాణ ఆర్టీసీ బ‌స్సులో ఉన్న‌ట్టుండి కాల్పుల మోత మోగింది. ఓ తుపాకీ నుంచి దూసుకువ‌చ్చిన బుల్లెట్‌.. జ‌నాల్లో ఎవ‌రినీ గాయ‌ప‌ర‌చకుండా బ‌స్ టాప్ ను బ‌ద్ద‌లు కొట్టుకుని గాల్లో కెళ్లిపోయింది. నిజంగానే ఈ ఘ‌ట‌న పెను క‌ల‌క‌ల‌మే రేపింది. ఎందుకంటే... బ‌స్సు నిండా జ‌నం ఉండ‌టం - ఉన్న‌ట్టుండి కాల్పులు జ‌ర‌గ‌డం అంటే మాట‌లు కాదు క‌దా. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి బెంబేలెత్తిపోయిన బ‌స్ డ్రైవ‌ర్ ఆ బ‌స్సును ఎక్క‌డా ఆప‌కుండా శ‌ర‌వేగంగా న‌డుపుకుంటూ కంటోన్మెంట్ డిపోకు చేర్చేశాడు. ఆ త‌ర్వాత త‌నలో రేగిన భ‌యాందోళ‌న‌ను కంట్రోల్ చేసుకుని కండ‌క్ట‌ర్ తో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

స‌రే ఇదంతా బాగానే ఉన్నా... కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి ఏమ‌య్యాడు.? అస‌లు అత‌ను ఎవ‌రు? ఎవ‌రైనా గుర్తించారా?.. సాయంత్రం దాకా ఈ వివ‌రాలేమీ బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌డం - స‌ద‌రు వ్య‌క్తి ఓ పోలీస్ అని తేల‌డం - అది కూడా ఏపీకి చెందిన పోలీస్ అని తేల‌డం ఇప్పుడు మ‌రింత క‌ల‌క‌లం రేపింది. కాల్పుల ఘ‌ట‌న‌కు పెద్ద కారణాలేమీ లేవు గానీ... తోటి ప్ర‌యాణికుల‌తో వాగ్వాదం నేప‌థ్యంలోనే అత‌డు తుపాకీ తీసి కాల్పులు జ‌రిపాడ‌ట‌. అయినా అత‌డి వివ‌రాలేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో పోలీస్ గా ప‌నిచేస్తున్న శ్రీ‌నివాస్‌... ఏపీలోని ఓ కీల‌క నేత‌కు గార్డుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ట‌. ఉద్యోగం ఏపీలోనే అయినా... భార్యాబిడ్డ‌లు మాత్రం హైద‌రాబాద్ లోనే ఉన్నార‌ట‌. ఈ క్ర‌మంలో త‌న‌కు కేటాయించిన విధులు ముగించుకుని భార్యాబిడ్డ‌ల వ‌ద్ద‌కు వ‌చ్చేసిన శ్రీ‌నివాస్‌... సిటీ బ‌స్ లో త‌న ఇంటికి వెళుతున్నాడ‌ట‌.

ఈ క్రమంలో ఫుట్ బోర్డులో నిల‌బ‌డ్డ శ్రీ‌నివాస్ ను పైకి ర‌మ్మ‌ని పిలిచే క్ర‌మంలో తోటి ప్ర‌యాణికుల‌తో అత‌డు వాగ్వాదానికి దిగాడ‌ట‌. ఉద్యోగంలో ఏ మేర ఒత్తిడులు ఎదుర్కొన్నాడో తెలియ‌దు గానీ... ఆ చిన్నపాటి వాగ్వాదానికే శ్రీనివాస్ త‌న వ‌ద్ద‌నున్న తుపాకీ తీసి కాల్పులు జ‌రిపాడ‌ట‌. అయితే కాల్పులు జ‌రిగాక గానీ తాను చేసింది ఎంత త‌ప్ప‌న్న విష‌యం తెలుసుకున్న శ్రీ‌నివాస్ ర‌న్నింగ్ లోనే బ‌స్ దిగేసి తుర్రుమ‌న్నాడ‌ట‌. అయితే అత‌డి వివ‌రాల‌ను సేక‌రించిన తెలంగాణ పోలీసులు... ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు స‌మాచారం చేర‌వేశార‌ట‌. ఈ వివ‌రాల‌ను తీసుకున్న ఠాకూర్‌...కాల్పులు జ‌రిపింది శ్రీ‌నివాసేన‌ని నిర్ధారించ‌డంతో పాటు అత‌డిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. శ్రీ‌నివాస్ చేసింది పెద్ద నేర‌మేన‌ని కూడా ఠాకూర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News