వివేకా మ‌ర్డ‌ర్ కేసు!... ద‌ర్యాప్తున‌కు ఇంకెంత టైమో?

Update: 2019-05-15 11:18 GMT
వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్యోదంతంపై ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతూనే ఉంద‌ట‌. ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ కు ముందే వివేకా పులివెందుల‌లోని ఆయ‌న సొంత ఇంటిలోనే హ‌త్యకు గుర‌య్యారు. రాష్ట్రవ్యాప్తంగా పెను క‌ల‌క‌లం రేపిన ఈ హ‌త్య‌పై అప్ప‌టిక‌ప్పుడే విచార‌ణ ప్రారంభించేసిన పోలీసులు...  వివేకా వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారు కావ‌డంతో దీనిపై ఏకంగా ప్ర‌త్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు  చేశారు. ఓ వైపు సిట్‌, మ‌రోవైపు క‌డ‌ప ఎస్పీ ఆధ్వ‌ర్యంలో మ‌రికొన్ని పోలీసు బృందాలు ఈ కేసు ద‌ర్యాప్తులో త‌ల‌మున‌క‌లై ఉన్నాయి.

ఇప్ప‌టికే ఈ హ‌త్యోదంతంతో సంబంధం ఉంద‌ని అనుమానిస్తున్న నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రోజుల త‌ర‌బ‌డి క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించారు. క‌స్ట‌డీ గ‌డువు ముగియ‌డంతో తిరిగి వారిని కోర్టులో హాజ‌రుప‌ర‌చి జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా విచార‌ణ‌లో నిందితులు ఏం చెప్పార‌న్న వివ‌రాల‌ను పోలీసులు మీడియాకు స‌వివ‌రంగానే అంద‌జేశారు. కేసు ద‌ర్యాప్తు పూర్తి కాలేదంటూనే విచార‌ణ‌లో నిందితులు చెప్పిన వివ‌రాల‌ను ఎలా బ‌య‌పెడ‌తారో ఏపీ పోలీసుల‌కే తెలియాలి అన్న వాద‌న నాడు వినిపించింది. తాజాగా బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప‌లు కేసులపై త‌న‌దైన శైలిలో స్పందించారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న వివేకా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీపై కూడా స్పందించారు. వివేకా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీపై తానేదో కొత్త విష‌యాన్ని చెబుతున్న‌ట్లుగా ఠాకూర్ క‌ల‌రింగ్ ఇచ్చారు గానీ... కొత్త విష‌య‌మేమీ ఆయ‌న చెప్ప‌లేదు. వివేకా హ‌త్యోదంతంపై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని మాత్ర‌మే ఆయ‌న చెప్పారు. అంతేకాదండోయ్‌... విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ కేసుకు సంబంధించిన వివ‌రాలేమీ చెప్ప‌లేమ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. మొత్తంగా వివేకా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీపై ఏదో కొత్త విష‌యాన్ని చెబుతున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చిన ఠాకూర్ పాత మాట‌ల‌నే వ‌ల్లె వేసేసి వెళ్లిపోయారు. మ‌రి వివేకా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.

Tags:    

Similar News