ఉద్యోగులతో ఢీ కొట్టేందుకే ?

Update: 2022-01-21 09:41 GMT
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకున్నదే చేసేలా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తాము చేసిన దాని మీదనే ముందుకు వెళ్ళేందుకు రెడీ అయింది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీయార్సికి  వ్యతిరేకంగా ఆందోళన పధంలో ఉంటే ప్రభుత్వం మాత్రం తాజా  మంత్రివర్గం భేటీలో ఆ కొత్త  జీవోలకు ఆమోద ముద్ర వేయడాన్ని బట్టి చూస్తే కచ్చితంగా ఢీ కొట్టేందుకే రెడీ అనుకోవాలి.

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా చేశామన్న భావనలో ప్రభుత్వం ఉంది.  కొత్తగా పీయార్సీ ప్రకటించాక ప్రభుత్వ ఖజానా మీద పది వేల కోట్లకు పైబడి ఆర్ధిక భారం పడుతోంది అని కూడా మంత్రుల నుంచి ఉన్నతాధికారులతో సహా అంతా చెబుతున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గినా మరింత భారం పడుతుంది అని కూడా ఆలోచనలో ఉంది.

అసలు ఈ కొత్త పీయార్సీ అమలు విషయమే ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా ఉంది అంటున్నారు. ఈ కారణం వల్లనే ఎంతో కొంత భారాన్ని తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. ఈ మేరకే హెచ్ ఆర్ సీ విషయంలో ఉద్యోగులు పట్టుబడుతున్న ప్రభుత్వం హామీ ఇవ్వలేకపోతోంది అంటున్నారు. ఇప్పటికే రావాల్సిన మొత్తాలు రాకుండా ఆర్ధికంగా అనేక అవస్థలు పడుతూ అప్పులతో కధ నడుపుతున్న ప్రభుత్వానికి ఈ టైమ్ లో ఉద్యోగుల డిమాండ్లు అన్నవి పెను భారాలే అంటున్నారు.

ఈ పరిణామాలతోనే రాజకీయంగా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ముందు సర్కార్ నడిపేందుకు ఖర్చుల అదుపు అన్న ఒకే ఒక పాయింట్ దగ్గరే ప్రభుత్వం ఆగింది అని తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులతో ఘర్షణ వల్ల రాజకీయంగా ఇబ్బంది అని తెలిసినా కూడా ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నిర్వహించడమే అతి పెద్ద లక్ష్యం కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

ఇంకోవైపు చూస్తే తాము ఏమీ ఉద్యోగులకు అన్యాయం చేయలేదు అన్న భావనతో వైసీపీ వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏ మాత్రం వెనక్కు తగ్గకూడదని, ముందుకే అడుగు వేయాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యాల మేరకే పీయార్సీకి సంబంధించిన జీవోలను క్యాబినెట్ ముందు పెట్టి మరీ ఆమోదించారు అని చెబుతున్నారు. ఈ టైమ్ లో ఉద్యోగులు ఏం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం బంతి తమ వద్ద లేదని తాజా డెసిషన్ తో తేల్చేసింది అని అంటున్నారు.
Tags:    

Similar News