ఉద్యోగ నేత‌ల‌ను మెప్పిస్తే సరిపోతుందా?

Update: 2022-02-07 12:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న ప్ర‌భుత్వానికి ఇబ్బంది రాకుండా ఓ స‌మ‌స్య‌కు సీఎం జ‌గ‌న్ తాత్కాలిక ప‌రిష్కారాన్ని చూపారు. పీఆర్సీ విష‌యంలో సమ్మెకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను ఆయ‌న ఆప‌గ‌లిగారు. హెచ్ఆర్ఏ స్లాబుల్లో మార్పులు చేస్తూ జీతం త‌గ్గ‌ద‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తూ ఉద్యోగుల‌ను చ‌ల్ల‌బ‌రిచే ప్ర‌య‌త్నాలు చేశారు. దీంతో మంత్రుల క‌మిటీతో స‌మావేశం త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్లిన పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌లు స‌మ్మె విర‌మించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేత‌ల వైఖ‌రిపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. డిమాండ్ల సాధ‌న కోసం ఉద్య‌మం మొద‌లెట్టి ఆందోళ‌న‌లు చేసి స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా వెన‌క్కి త‌గ్గడం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.  జ‌గ‌న్ ప్ర‌లోభాల‌కు త‌లొగ్గి ఉద్యోగ సంఘాల నేత‌లు స‌మ్మె నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నార‌ని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆందోళ‌న కొన‌సాగించాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు.

23 ఫిట్‌మెంట్‌తో కొత్త‌గా ప్ర‌క‌టించిన పీఆర్సీని ర‌ద్దు చేయాల‌నే డిమాండ్‌తో పీఆర్సీ సాధ‌న స‌మితి ఉద్య‌మానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల ఆరు అర్ధరాత్రి నుంచి స‌మ్మెకు వెళ్తున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నోటీసు కూడా ఇచ్చింది. చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. ల‌క్ష‌ల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైంది. ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో మంత్రుల క‌మిటీ చ‌ర్చ‌లు జ‌రిపింది. ఫిట్‌మెంట్ పెంచేందుకు ఒప్పుకోని మంత్రుల క‌మిటీ మిగ‌తా డిమాండ్ల‌పై సానుకూలంగా స్పందించింద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు చెప్పారు. స‌మ్మె విర‌మిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఈ చ‌ర్చ‌ల వ‌ల్ల ఉద్యోగుల‌కు ఒరిగిందేమీ లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అందుకే ఉద్యోగులు అసంతృప్తితో రగులుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాళ్లు ఆందోళ‌న చెందుతున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగానే ఉన్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి స‌మ్మె జ‌ర‌గ‌కుండా చూసి జ‌గ‌న్ బ‌య‌ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ ఉద్యోగులు మాత్రం ఆయ‌న‌కు అండ‌గా నిలిచే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఉద్యోగుల ఓట్లు ప‌డ‌డం క‌ష్ట‌మేన‌ని వివ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల్లోపూ ఉద్యోగుల‌కు మేలుగా ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటే త‌ప్ప జ‌గ‌న్‌కు దెబ్బ త‌ప్ప‌ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.
Tags:    

Similar News