సమ్మె చేస్తాం.. ఎన్నికలు మాత్రం వద్దు!

Update: 2021-01-23 12:28 GMT
ఏపీలో 'పంచాయితీ' ఎన్నికలు పెద్ద పంచాయితీనే తెచ్చిపెట్టాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ  ఎక్కడా తగ్గడం లేదు.  ప్రభుత్వం, ఏపీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా సరే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి ఉద్యోగులు సైతం రెడీ అయ్యారు.ఇప్పటికే ఎస్ఈసీ ఎన్నికల ఏర్పాట్లపై ఈ మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ కు పిలిస్తే ఏపీ సీఎస్, డీజీపీ, పంచాయితీరాజ్ అధికారులు గైర్హాజరయ్యారు. ఇప్పుడు ఏపీ ఉద్యోగులు కూడా నిమ్మగడ్డకు అల్టీమేటం జారీ చేశారు.

తాజాగా ఎస్ఈసీ తీరుపై ఏపీ ఎన్జీవోల సంఘం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎన్నికలను బహిష్కరిస్తామని.. అవసరమైతే సమ్మె చేస్తామంటూ స్పష్టం చేసింది. కరోనా టీకాలు వేసుకున్నాకే విధుల్లోకి వస్తామని కుండబద్దలు కొట్టారు. తమ శవాల మీద నడుచుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తారా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఈ మేరకు నిప్పులు చెరిగారు. ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రాణాలు పొగొట్టుకోవాల్సిన అవసరం లేదని.. అవసరమైతే సమ్మెకు సిద్ధమని ప్రకటించారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని..  భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్ఈసీలు వస్తారు పోతారని.. ఉద్యోగుల సంక్షేమమే తమకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.దీంతో ఏపీ పంచాయితీ ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఎన్నికలు కొనసాగుతాయా? లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News