స‌మ్మె సైరన్ మోగితే ఏమౌతుంది? టెన్ష‌న్ టెన్ష‌న్

Update: 2022-02-05 17:49 GMT
ఆర్థికంగా ఏమీ లేని రాష్ట్రానికి ఇప్ప‌టికిప్పుడు రెండు వేల కోట్ల రూపాయ‌ల అప్పు కావాలి. రుణ‌మో రామ‌చంద్ర అన్న చందంగా గడుస్తున్న స‌మ‌యంలో ఉద్యోగులు స‌హాయ నిరాక‌ర‌ణ అంటూ స‌మ్మె అంటూ  ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు అన్న విమ‌ర్శ‌లున్నాయి. పాల‌క వ‌ర్గాలకు మ‌రో ఆలోచ‌న అన్న‌ది చేయ‌కుండా చేస్తున్నారు. స‌మ్మె త‌థ్యం అయితే రాష్ట్ర ప్ర‌గ‌తి మ‌రింత అధోగ‌తికి చేరిపోతుంది.అప్పుడు నష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నా ఆర్థిక వృద్ధి సాధించ‌డం క‌ష్ట‌మే! ఇన్నింటినీ ఆలోచించుకుని ఉద్యోగులు రోడ్డెక్కితే మేలు అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. కాస్త సామాజిక బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తే పీఆర్సీ అనే కాదు ఏ స‌మ‌స్య అయినా ప‌రిష్కారానికి నోచుకునే వీలుంద‌ని ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు అంటున్నాయి. కానీ ఎప్ప‌టిక‌ప్పుడు తాము చెప్పిందే నెగ్గాల‌న్న వాద‌నలో ఉద్యోగ సంఘాలు ఉంటున్నాయ‌ని, అందుకే చ‌ర్చ‌ల్లో ప్ర‌తిష్టంభ‌న ఉంటోంద‌ని తెలుస్తోంది.ఈ త‌రుణంలో స‌మ్మె అనివార్యం అయితే సామాన్యుల క‌ష్టాలు కూడా ఊహాతీత‌మే!

ఆంధ్రావ‌నిలో పూర్తి ఉత్కంఠ పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది.ఉద్యోగులకు,మంత్రుల క‌మిటీకి మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ నేప‌థ్యంలో స‌మ్మెసైర‌న్ మోగేందుకు ఎక్కువ అవకాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ స‌మ్మె జ‌రిగితే అటు ఆర్టీసీ, ఇటు వైద్య రంగాల‌తో పాటు విద్యుత్ రంగంలోని ఉద్యోగులు కూడా త‌మ విధుల‌ను వ‌దులుకుని స‌మ్మె బాట ప‌ట్ట‌నున్నారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మ‌యిన కార్యాచర‌ణ‌తో ఉద్యోగులు ముందుకు వెళ్తున్నారు. ఇవాళ గ‌నుల శాఖ‌లో ఉద్యోగుల‌పై ఎస్మా ప్ర‌యోగించి త‌రువాత వెన‌క్కు తీసుకున్న ప్ర‌భుత్వం ఇంకొన్ని దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు సైతం సిద్ధంగానే ఉంది. కానీ ఉద్యోగులు 30 శాతం ఫిట్మెంట్ పైనే ప‌ట్టుబ‌డుతున్నారు.

ఒక‌వేళ ఉద్యోగులు స‌మ్మెకు వెళ్తే విద్యుత్, ఆర్టీసీ రంగాల‌కు సంబంధించి సంక్షోభం త‌లెత్తి పూర్తిగా అవి కోలుకోలేని స్థితికి చేరుకుంటాయ‌ని సంబంధిత విష‌య నిపుణులు అంటున్నారు.ఇప్ప‌టికే న‌ష్టాల్లో ఆర్టీసీ ఉంద‌ని, పండ‌గ సీజ‌న్ తో కాస్తో కూస్తో కోలుకుంది కానీ ఇప్పుడీ స‌మ్మె చావు దెబ్బ కొడితే ఒక్క‌సారిగా రాష్ట్రం అత‌లాకుత‌లం అయిపోవ‌డం ఖాయం. పోలీసులు కూడా ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తితోనే  ఉన్నారు అని తెలుస్తోంది.వారి ప‌రోక్ష స‌హ‌కారం అని ల‌భిస్తే ఇంకా స‌మ్మె ఉద్ధృతం కావ‌డం నిర్థార‌ణ‌కు నోచుకునే విష‌యం. ఇప్పటికే చ‌లో విజ‌య‌వాడ స‌క్సెస్ అవ్వ‌డంతో డైల‌మాలో ప‌డ్డ ప్ర‌భుత్వం ఇప్పుడేం చేయాలో తోచ‌క ప్ర‌త్యామ్నాయం పై దృష్టి నిలిపింది.

స‌మ్మె జ‌రిగితే నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఒక్క‌సారిగా పెరుగుతాయి. స‌మ్మె జ‌రిగితే ర‌వాణా వ్య‌వ‌స్థ పై తీవ్ర ప్ర‌భావం ఉంటుంది. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మిన‌హాయించి స‌మ్మె చేస్తే కాస్త స‌బ‌బుగానే ఉంటుంది కానీ అది కూడా ఉద్యోగ సంఘాలు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేవు. నిన్న‌టి అర్ధ రాత్రి (శుక్ర‌వారం అర్ధ‌రాత్రి) చ‌ర్చ‌ల స‌మ‌యంలో అంతా బాగుంటుంది అని భావించినా, మ‌ళ్లీ ఉద్యోగులు రివ‌ర్స్ గేర్ వేశారు. దీంతో స‌మ్మెకు పోకుండానే చ‌ర్చ‌లు జ‌రిపి, సమ‌స్య‌ను ప‌రిష్కరిద్దాం అని భావించిన స‌ర్కారుకు చుక్కెదురు అయింది. ఒక్క‌సారిగా అన్ని వ్య‌వ‌స్థ‌లూ నిలిచిపోతే రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిపోతుంది.ఇప్పుడిప్పుడే క‌రోనా నుంచి కోలుకుంటున్న ఆర్థిక రంగం మ‌ళ్లీ ప‌త‌నం కావ‌డం ఖాయం.ఈ ద‌శ‌లో ఫిట్మెంట్ పై నిర్ణ‌యం మార్చుకుంటారా? లేదా ఉద్యోగుల‌కు మ‌రేద‌యినా చెప్పి స‌ర్ది చెప్పి పంపుతారా?
Tags:    

Similar News