చంద్రబాబు నిరసన దీక్ష - 36 గంటలు, ముహూర్తం ఫిక్స్

Update: 2021-10-20 09:23 GMT
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడులను నిరసిస్తూ 36 గంటల పాటు నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష సాగనుంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో చంద్రబాబు ఈ దీక్ష చేపడుతున్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద ఎక్కడైతే విధ్వసం జరిగిందో అక్కడే నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు.

టీడీపీ నేత పట్టాభి, సీఎం వైఎస్‌ జగన్‌ పై చేసిన కామెంట్ల తర్వాత, టీడీపీ హెడ్‌ ఆఫీసుతో పాటు  కొన్ని జిల్లాల్లోని ఆఫీసులపై కూడా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇక, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కేంద్ర హోంశాఖ, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ఇంతకంటే దారుణం ఏముంటుంది, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యిందంటూ ఫైర్ అయ్యారు. దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం నశించిందని..ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు. కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారని వివరించారు. నిన్నటి రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన దాడి పైన పోలీసులు కేసు నమోదు చేసారు. ఎస్సై నాయక్ పైన దాడి చేసారంటూ ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్ పైన హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. దాడి ఘటన లో 70 మంది పైన మంగళగిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దాడి ఘటన పైన ఇప్పటికే చంద్రబాబు గవర్నర్ తో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. దీని పైన ఈ రోజున ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. దాడి జరిగిన కార్యాలయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ పరామర్శించారు.
Tags:    

Similar News