బీరు హెల్త్ డ్రింకేనంటున్న ఈ మంత్రిని చూశారా?

Update: 2017-07-04 06:01 GMT
టీడీపీ నేత‌ - ఏపీ కేబినెట్‌ లో ఇటీవ‌లే బెర్తు ద‌క్కించుకుని అబ్కారీ శాఖ ప‌గ్గాలు చేప‌ట్టిన కేఎస్ జ‌వ‌హ‌ర్‌... త‌మ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడును నిండా ముంచేశారు. ఎక్సైజ్ శాఖా మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా... మ‌ద్యం విక్ర‌యాల‌పై వ‌చ్చే ఆదాయాన్ని త‌మ ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోద‌ని, అస‌లు మ‌ద్యం ద్వారా వ‌స్తున్న ఆదాయాన్ని ఆదాయంగానే ప‌రిగ‌ణించ‌బోమ‌ని, మ‌ద్యం త‌మ‌కు ఆదాయ వ‌న‌రు కాద‌ని కూడా ఇప్ప‌టికి లెక్క‌లేన‌న్ని సార్లు చెప్పే ఉంటారు. జాతీయ ర‌హ‌దారుల‌పై మ‌ద్యం విక్ర‌యాలకు సంబంధించి ఇటీవ‌ల స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గ నిర్దేశాలను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయ‌క తప్ప‌ని ప‌రిస్థితి అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ప‌డింది.

ఈ విష‌యంలో ఇత‌ర రాష్ట్రాల ప‌రిస్థితి ఎలా ఉన్నా... ఏపీ ప‌రిస్థితి మాత్రం పెనంపై నుంచి పొయ్యిలో ప‌డిపోయినట్టుగా మారిపోయింది. మొన్న జూన్ 30తో మ‌ద్యం దుకాణాలు, బార్ల లైసెన్సుల కాల ప‌రిమితి ముగిసిపోయింది. కొత్త మ‌ద్యం పాల‌సీని తీసుకొచ్చిన చంద్రబాబు స‌ర్కారు... ఆ పాల‌సీ ప్ర‌కారం మ‌ద్యం విక్ర‌యాల‌కు తెర లేపింది. అయితే జాతీయ ర‌హ‌దారుల వెంట మ‌ద్యం దుకాణాల‌ను ఏర్పాటు చేస్తే... సుప్రీం కొర‌డా ఝుళిపిస్తుంది కాబ‌ట్టి... దానికి విరుగుడుగా ఇప్పుడు జాతీయ ర‌హ‌దారుల వెంట స‌ర్వీస్ రోడ్లు వ‌చ్చేశాయి. వీటిపైనే ఇప్పుడు మ‌ద్యం షాపులు వెల‌స్తున్నాయి. అయితే రోడ్డుపై నుంచి త‌మ ఇళ్ల వ‌ద్ద‌కు వ‌చ్చేస్తున్న మ‌ద్యం షాపుల‌ను జ‌నం ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటున్నారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితితో త‌ల‌ప‌ట్టుకున్న ప్ర‌భుత్వం... స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలా? అన్న కోణంలో ప‌రిప‌రివిధాలా ఆలోచిస్తోంది.

ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన జ‌వ‌హర్‌... స‌మ‌స్య ప‌రిష్కారం కోసం త‌మ ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తోంద‌ని, రెండు మూడు రోజుల్లోగా ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంద‌ని చెప్పారు. ఇక య‌థాలాపంగా త‌న నోటి నుంచి మ‌ద్యం వ్యాపారం త‌మ‌కు ఆదాయ వ‌న‌రు కాద‌ని ఆయ‌న చెప్పారు. ప‌నిలో ప‌నిగా ఇంకో మాట కూడా ఆయ‌న నోటి నుంచి దూసుకువ‌చ్చింది. బీరును హెల్త్ డ్రింక్‌గా అభివ‌ర్ణించిన ఆయ‌న‌... బీరును హెల్త్ డ్రింగ్ గానే త‌మ ప్ర‌భుత్వం ప్ర‌మోట్ చేస్తోంద‌ని చెప్పారు. ఈ మాట విన్న మీడియా మిత్రులు నోరెళ్ల‌బెట్టేశార‌ట‌. అస‌లు మ‌ద్యం వ్యాపారం జ‌ర‌గ‌క‌... ప‌న్ను రాక చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డుతుంటే... ఇక కొత్త‌గా బీరుపై హెల్త్ డ్రింక్ ముద్ర వేసిన జ‌వ‌హ‌ర్ పార్టీ అధినేత నుంచి చీవాట్లు తినేలానే ఉన్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News