పవన్ ఇష్యూలో తప్పు మీద తప్పు చేస్తున్న జగన్ సర్కార్

Update: 2022-10-17 05:08 GMT
పరిస్థితులు సానుకూలంగా ఉన్న వేళలో ఎవరైనా సమర్థులు.. తెలివైన వారిగానే కనిపిస్తారు. అందులోకి చేతిలో అధికారంలో ఉంటే ఇక చెప్పాల్సిన అవసరమే ఉండదు. అందుకు భిన్నంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తెలివిగా స్పందించటానికి మించింది ఉండదు. ఈ తీరులో ఏపీ అధికారపక్షం తరచూ తప్పులు చేస్తూనే ఉందన్న మాట వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో జగన్ పరివారం వ్యవహరిస్తున్న తీరు..ఆయన ఇమేజ్ పెరిగేలా.. పవన్ కు సానుభూతి పెంచే పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతున్నారు.

నిజానికి పవన్ తప్పు చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ.. ఆయన తప్పు నేరుగా లేని వేళ.. ఆయన్ను ఇరికించాలని.. ఆయన్ను ఇబ్బందిపెట్టాలన్న రీతిలో వ్యవహరిస్తున్న తీరు ఆయనకు సానుభూతి పెరగటమే కాదు.. అయ్యో పాపం.. పవన్ ను ఎందుకింతలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు? అన్న భావన సామాన్యుల్లో కలిగేలా చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైనా సరే.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రజల కోసం.. ప్రజా సమస్యల కోసం తాను ప్రజల మధ్యే ఉంటానని చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్న పవన్ తీరుపై ప్రజల్లో ఇప్పుడు సానుకూలత అంతకంతకూ పెరుగుతోంది. ఈ విషయాన్ని జగన్ అండ్ కో గుర్తించాల్సిన అవసరం ఉంది.

పవన్ ప్రస్తావన ఎత్తితే చాలు.. వైసీపీ నేతలు మూడు పెళ్లిళ్లు అంటూ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నల్ని సంధిస్తుంటారు. నిజమే.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అది కూడా చట్టబద్ధంగా విడాకులు తీసుకొని. అలాంటప్పుడు అందులో వేలెత్తి చూపించటానికి.. తప్పుగా ప్రస్తావించటానికి ఏముంటుందన్నప్రశ్న ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది.

విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ మంత్రుల వాహనాలపై జనసేన కార్యకర్తలు పలువురు దాడి చేసిన ఉదంతంలో పవన్ కల్యాణ్ కు నేరుగా ఎలాంటి పాత్ర లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పవన్ బస చేసిన హోటల్ వద్ద పోలీసులు చేసిన హడావుడి.. ఆయన పార్టీ నేతల్ని అదుపులోకి తీసుకున్న తీరు.. ఆయన కారు తాళాలు ఇవ్వాలని కోరటం.. ఆయన మీద ఆంక్షల్ని విధించటం.. నోటీసులు ఇవ్వటం లాంటి వాటితో వరుస తప్పులు జరిగినట్లుగా వైసీపీ నేతలు సైతం అంతర్మధనం చెందుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున సలహాదారుల టీం ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వారు ఏం చేస్తున్నారని? ప్రశ్నిస్తున్నారు. పవన్ ను రాజకీయంగా ఎదుర్కొవాలన్నదే లక్ష్యమైతే.. అందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మరోలా ఉండాలి.

అంతే తప్పించి.. జనసేనాని విశాఖలోకి అడుగు పెట్టటానికి ముందే మంత్రులకు నిరసన సెగ తాకేలా పరిస్థితులు ఉన్నాయంటే.. అందుకు కారణాల్ని చూసుకొని.. తర్వాతి రోజుల్లో ఎలా వ్యవహరించాలనే వ్యూహం ఉండాలే తప్పించి.. ఈ దాడి ఘటన జరిగిన తర్వాత విశాఖకు వచ్చిన పీకేను టార్గెట్ చేసిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. పవన్ విశాఖ ఎపిసోడ్ లో జగన్ అండ్ కో తప్పుల మీద తప్పులు చేసిందన్న మాట వినిపిస్తోంది. మరి.. సీఎంజగన్ సలహాదారులు ఏం చేస్తున్నట్లు? డ్యామేజ్ కంట్రోల్ కోసం వారేం చేయనున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News