ఉద్యోగాలేవి సారూ ! జ‌గ‌న్ వెర్స‌స్ కేసీఆర్ !

Update: 2022-05-21 16:30 GMT
ఉద్యోగ ప‌ర్వంలో ఇప్ప‌టికిప్పుడు ఏపీ సాధించింది ఏమీ  లేదు. మాట్లాడుతున్న‌దీ ఏమీ లేదు. ఎందుకంటే ఆంధ్రావ‌ని వాకిట కొత్త‌గా మూడేళ్ల కాలంలో ఒక్క‌టంటే ఒక్క నోటిఫికేష‌న్ లేదు. స‌చివాల‌య ఉద్యోగాలు త‌ప్ప కొత్త‌గా సాధించిందీ ఏమీ లేదు. ఈ దశ‌లో ఏపీ సాధించాల్సిన వాటి క‌న్నా తెలంగాణ సాధించిన‌వి కాస్తో కూస్తో చెప్పుకోద‌గ్గ ప్ర‌గ‌తికి చెందినివి కొన్నే ఉన్నాయి. అవే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. జ‌గ‌న్ ఒక్క డీఎస్సీకి ఇప్ప‌టిదాకా నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేదు స‌రిక‌దా నూత‌న విద్యావిధానంపేరిట చాలా ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను విలీనం చేసేశారు. దాంతో ప‌ల్లెల్లో ప్రాథ‌మిక స్థాయిలో బ‌డులు లేక నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి.

ఇక బ‌డుల విలీనం ఎలా ఉన్నా టీచ‌ర్ల నియామ‌కాలు అస్స‌లు లేవు. దాంతో చాలా చోట్ల వ‌లంటీర్లే దిక్క‌వుతున్నారు. ఇవి చాల‌వ‌న్న‌ట్లు కొన్ని పాఠ‌శాల‌లే నాడు నేడు కింద శుభ యోగం ద‌క్కించుకున్నాయి. మెగా డీఎస్సీకి ప్ర‌క‌ట‌నే లేదు. అదే తెలంగాణ‌లో టెట్ కు నోటిఫికేష‌న్ ఇచ్చారు కేసీఆర్.

పోలీసు శాఖ‌లో ఉద్యోగాలు అప్లై చేసుకునే యువ‌త‌కు వ‌యో ప‌రిమితి రెండేళ్లు పెంచారు. ఇందుకు సంబంధించి సీఎం తీసుకున్న నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌లుకు నోచుకోనుంది. ఇదే కాకుండా చాలా విష‌యాల్లో కేసీఆర్ కాస్తో కూస్తో ముందే ఉన్నారు. పోస్టుల ఖాళీల‌ను ఆయ‌న ఇప్ప‌టికే గుర్తించి, సంబంధిత భ‌ర్తీల‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇదే ఆంధ్రాలో అయితే అత్యవ‌సం అయితే త‌ప్ప పోస్టింగుల‌కు పిలుపే లేదు.

ఓ విధంగా జాబ్ క్యాలెండర్ అమ‌లే లేదు. హోంగార్డు నోటిఫికేష‌న్ కూడా లేదు. దీంతో దిగువ స్థాయిలో సిబ్బంది లేక పోలీసు యంత్రాంగం అవ‌స్థ‌లు ప‌డుతోంది. కొన్ని చోట్ల త‌ప్ప‌క క‌మ్యూనిటీ పోలీసింగ్ కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు కానీ అది కూడా స‌త్వర చ‌ర్య‌లు ఇవ్వ‌డం లేదు.

సిబ్బంది కొర‌త‌కు ప్ర‌యివేటు వ్య‌క్తుల నియామ‌కం స‌రైన ప‌రిష్కారం కాదు క‌దా! ఇక మిగ‌తా శాఖ‌ల్లో దిగువ స్థాయిలో క‌నీసం కారుణ్య నియామ‌కాల్లో కూడా అవినీతి లేకుండా చేయ‌లేక‌పోతున్నారు. పోస్టులు ఇచ్చినా కూడా లంచాలు మాత్రం ముట్టాల్సిందే !కాంట్రాక్టు మ‌రియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు ఆర్థిక భ‌ద్ర‌త లేదు. రెండు మూడు నెల‌లు జీతాలు లేకుండా వీళ్లంతా కాలం నెట్టుకు రావ‌డ‌మే విచార‌క‌రం.

ఇలాంటి స‌మ‌స్య‌లే తెలంగాణ‌లో ఉన్నా కూడా కొన్ని మాత్రం రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం అయినా కేసీఆర్ ప‌రిష్క‌రించి సంబంధిత వ‌ర్గాల‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ఇస్తున్నారు. కానీ జ‌గ‌న్ మాత్రం ఆ దిశ‌గా అడుగులు వేయ‌క‌పోవ‌డమే ఇప్ప‌టి విషాదం.
Tags:    

Similar News