కొత్త రోడ్ మ్యాప్ : ఆగస్ట్ తరువాత వైసీపీకి చుక్కలేనా...?

Update: 2022-06-10 23:30 GMT
ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహాలు ఏమున్నాయో తెలియదు కానీ కేంద్రం మీద బాగా ఆధారపడుతోంది. బీజేపీని అయితే తెగ నమ్ముతోంది. బీజేపీ ఇచ్చే పొలిటికల్  స్టోక్స్ ఎలా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. రాజకీయ గండరగండడు చంద్రబాబునే ఇబ్బందులు పెట్టిన చరిత్ర కళ్ల ముందే ఉంది. ఇక లేటెస్ట్ గా చూసుకుంటే తెలంగాణాలో కేసీయార్ ని టార్గెట్ చేసి నానా రకాలుగా యాగీ చేస్తున్నారు. మరి జగన్ విషయంలో మాత్రం కేంద్రం ఇప్పటిదాకా అయితే స్మూత్ గానే వ్యవహరిస్తోంది.

మరి ఇది ప్రేమ అనుకోవాలా అంటే రాజకీయాల్లో ప్రేమలకు అసలు తావు లేదు. ఆ మధ్యన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అనంతపురం టూర్ కి వచ్చినపుడు చెప్పిన మాట ఏంటి అంటే మోడీ జగన్ లది తండ్రీ కొడుకుల అనుబంధమని. జగన్ అంటే అంత మోడీకి అంత వాత్సల్యమని. వినడానికి చెప్పుకోవడానికి ఇవి బాగా ఉంటాయి కానీ రాజకీయాలో చూస్తే అన్నిటికీ లెక్కలు ఉంటాయి.

ఇక జగన్ అంటే నిజమైన ప్రేమ కాదు ఆయన వెనక ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల మీద ప్రేమ అని అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీకి జగన్ తో చాలా అవసరాలు ఉన్నాయి. అర్జంటు గా రాష్ట్రపతిగా తాను కోరుకున్న అభ్యర్ధిని గెలిపించుకుని రాష్ట్రపతి భవన్ లో కూర్చోబెట్టుకోవాలి.  2024 నాటికి ఎటు నుంచి ఏమి జరిగినా తమ ప్రభుత్వం మూడవసారి కేంద్రంలో ఏర్ప‌డేలా చూసుకొవాలి.

అందుకే జగన్ తో మంచిగా ఉంటున్నారు. జూలై లో రాష్ట్రపతి ఎన్నిక పూర్తి అవుతుంది. ఇక ఆగస్ట్ లో ఉప రాష్ట్రపతి ఎన్నిక కూడా ముగుస్తుంది. ఈ రెండు కీలకమైన పదవులలో తమ వారిని గెలిపించుకుంటే ఇక బీజేపీకి ఏ చింతా లేదు. దాంతో వైసీపీ మద్దతు కూడా అసలు అవసరమే  పడదు.

మరి అలా కనుక చూస్తే జగన్ని ఇదివరకు మాదిరిగా కేంద్ర పెద్దలు సమాదరిస్తారా అన్నదే ఇక్కడ చర్చ. జగన్ ఇపుడు సులువుగా మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్లు సంపాదిస్తున్నారు. కేంద్రం కూడా ఏమీ చేయకపోయినా జగన్  విన్నపాలకు  అన్నీ విన్నట్లుగానే తలూపుతోంది. కానీ రేపటి రోజున ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్లే జగన్ కి కష్టం అవుతాయి అని అంటున్నారు.

అంతే కాదు, ఇపుడు పరిమితికి మించి అప్పులు చేస్తున్నా కేంద్రమే  సులువుగా ఏపీకి అనుమతి ఇస్తోంది. దాంతో ఏపీలో బండిని వైసీపీ పెద్దలు నెట్టుకువస్తున్నారు. అదే పొరుగున ఉన్న కేసీయార్ ని ముప్పతిప్పలు పెడుతున్నారు. అప్పులు చేసుకుంటామన్నా అనుమతి ఇవ్వడంలేదు. ఎందుకంటే కేసీయార్ తమ మీద గురి పెట్టారని ఆగ్రహంతో ఇదంతా చేస్తున్నారు.

దాంతో తెలంగాణా సర్కార్ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేపటి రోజున ఏపీకి అలాంటి పరిస్థితి రావచ్చు అని బీజేపీ రాజకీయాలు తెలిసిన వారు ఊహిస్తున్నారు. ఏపీ పూర్తిగా కేంద్రాన్ని నమ్ముకుని ముందుకు సాగుతోంది. ఏపీలో సంక్షేమ పధకాలు అమలు కావాలన్నా ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా కేంద్రం సాయం తప్పనిసరి.

అయితే తన రాజకీయం తాను చూసుకునే బీజేపీ ఏపీలో వైసీపీ రాజకీయం సాఫీగా సాగడానికి ఎంతమేరకు సహకరిస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్. మరో రెండేళ్ల పాటు ఏపీలో బండి లాగాలీ అంటే అప్పులు విరివిగా పుట్టాలి. కేంద్రం కూడా ఓకే చెప్పాలి. కానీ బీజేపీ వైఖరి తెలిసిన వారు అలా కానిచ్చే సమస్యే లేదు అంటున్నారు.

అంటే బీజేపీ అసలైన రోడ్ మ్యాప్ అన్నది ఆగస్ట్ తరువాత బయటకు తీస్తుంది అని చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబుతో పాటు జగన్ని కూడా ఇబ్బంది పెట్టడం ద్వారా తాము రాజకీయంగా బలపడాలన్నదే బీజేపీ ఎత్తుగడ అని అంటున్నారు. దానికి నాందిగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోదావరి గర్జనలో వైసీపీని అన్నేసి మాటలు అన్నారని చెబుతున్నారు. ఏతా వాతా తేలేది ఏంటి అంటే ఆగస్ట్ తరువాత వైసీపీకి చుక్కలు చూపించేందుకు రంగం సిద్ధమవుతోంది అంటున్నారు. మరి అదే జరిగితే వైసీపీ ఇబ్బందుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.
Tags:    

Similar News