కరోనా సహాయంపై ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు .. !

Update: 2021-10-26 06:26 GMT
కరోనా వైరస్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.  ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా, ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. కుటుంబాలు అల్లకల్లోలం అయ్యాయి. జీవానాధారం అయిన వారు కన్నుమూయడంతో సంపాదన లేక అల్లాడిపోయాయి లక్షలాది కుటుంబాలు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురుచూశాయి కుటుంబాలు. కరోనా వైరస్‌ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.

ఇక తాజాగా కోవిడ్‌ బాధితుల సహాయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను చెల్లించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కోవిడ్ మృతుల జాబితా రూపొందించి దానికి అనుగుణంగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఇక మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తు తీసుకున్న రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు కోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించిన వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్‌ మృతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంలో ఎలాంటి ఆలసత్వం వహించరాదని, త్వరగా వారి కుటుంబాలకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

కరోనా వైరస్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధనా మండలి నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం ధృవీకరించిన కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేసేలా చర్యలు చేపట్టనుంది.  కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థసిఫార్సు చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందజేయనుంది.
Tags:    

Similar News