కోర్టు ధిక్కారం ఎఫెక్ట్‌: ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు, జ‌రిమానా విధించిన ఏపీ హైకోర్టు

Update: 2022-05-07 03:28 GMT
ఏపీలో ఉన్న‌త‌స్థాయి అధికారులు చేస్తున్న అతి.. వారికే శాపంగా మారుతోంది. ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆర్బీకేలు, స‌చివాల‌యాలు ఏర్పాటు చేసిన నేరానికి 8 మంది ఐఏఎస్ అధికారుల‌కు హైకోర్టు.. సేవా శిక్ష‌ను విధించిన సంగ‌తి మ‌రిచిపోక‌ముందే.. తాజాగా మ‌రో ముగ్గురు ఐఏఎస్‌ల‌కు.. జైలు జ‌రిమానా విధించ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. వివ‌రాలు..

కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్‌లకు రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం శిక్ష విధించిన వారిలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ పూర్వ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్‌ ఉన్నారు. వారికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

కోర్టుకు హాజరైన ఐఏఎస్‌లు అరుణ్‌కుమార్‌, వీరపాండియన్‌ అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలు నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అయితే సకాలంలో ఐఏఎస్‌ అధికారి పూనం మాలకొండయ్య హాజరుకాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు. న్యాయస్థానాలు ఎవరి కోసమూ ఎదురు చూడవని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నెల 13లోపు హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌) ముందు సరెండర్‌ కావాలని ఐఏఎస్‌ అధికారి పూనం మాలకొండయ్యను ఆదేశించారు.

అయితే.. దీనిపై హుటాహుటిన స్పందించిన పూనం.. సింగిల్‌ జడ్జి తీర్పుపై  అత్యవసరంగా ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. ఆ అప్పీల్‌పై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం.. పూనం మాలకొండయ్య విషయంలో సింగిల్‌ జడ్జి తీర్పును నిలుపుదల చేసింది.

ఎందుకు ఈ శిక్ష‌లు..?

కర్నూలు జిల్లా ఎంపిక కమిటీ తనను విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2)గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలు చేస్తూ జిల్లాకు చెందిన ఎన్‌.మదన సుందర్‌ గౌడ్‌ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పోస్టుకు పిటిషనర్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని, రెండు వారాల్లో ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని 2019 అక్టోబర్‌ 22న న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

ఈ వ్యాజ్యంపై లోతైన విచారణ చేసిన న్యాయమూర్తి.. ఐఏఎస్‌ పూనం మాలకొండయ్య 2019 సెప్టెంబర్‌ 27న.. హెచ్‌ అరుణ్‌కుమార్‌కు సూచనలు ఇవ్వడం తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తప్పుట్టారు. మరోవైపు కోర్టు ఆదేశాల అమలు కోసం అరుణ్‌కుమార్‌.. జి.వీరపాండియన్‌కు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదన్నారు. వీరపాండియన్‌ సైతం కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలయ్యాకే.. స్పీకింగ్‌ ఉత్తర్వులిచ్చారన్నారు.

సరైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయడంలో అధికారులు ముగ్గురూ నిర్లక్ష్యం చేశారని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కోర్టు ఉత్తర్వుల అమలులో ఇబ్బంది ఎదురైతే అధికారులు సమయం పొడిగింపు కోసం న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేయవచ్చని, ప్రస్తుత కేసులో అలాంటి యత్నాలు చేయలేదని స్పష్టం చేశారు. మొత్తానికి జ‌గ‌న్ జ‌మానాలో ఐఏఎస్‌లకు శిక్ష ప‌డ‌డం అలవాటుగా మారింద‌నే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు కూడా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News