ఆ జడ్జి బదిలీ వైసీపీకి ఇక సంతోషమేనా?

Update: 2022-11-25 12:30 GMT
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులను దేశంలో వివిధ హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే న్యాయమూర్తుల బదిలీ జరుగుతుంది.

కాగా సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసిన వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ఆయన పలుమార్లు తప్పుబట్టారు. దీంతో ఇప్పుడు ఆయన వెళ్లిపోనుండటంతో వైసీపీకి ఇక సంతోషమేనని చెబుతున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేయడాన్ని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే రాజధాని విషయంలో అమరావతి రైతులకు అండగా నిలిచారు. అదేవిధంగా రాష్ట్ర రాజధాని ఏదని ఢిల్లీలో తన కుమార్తెను ఆమె స్నేహితులు ఏడిపిస్తున్నారని.. రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ పలుమార్లు తీర్పులిచ్చిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది.

దాదాపు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా దాదాపు మూడేళ్లు పనిచేసిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సంచలన తీర్పులిచ్చారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితులకు 41ఏ కింద నోటీసులు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ ఏకంగా నాటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కోర్టుకు పిలిపించి ఆయనతో చట్ట నిబంధనలను చదివించారు.

ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు వైసీపీ రంగులేసిన వ్యవహారంలో నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కోర్టుకు పిలిపించి అక్షింతలు వేశారు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు, వైద్య సిబ్బందికి కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని ప్రభుత్వ డాక్టర్‌ సుధాకర్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం సుధాకర్‌ను టార్గెట్‌ చేసుకోవడంతో ఆయన మరణించారు. దీనిపైన టీడీపీ నేత అనిత పిటిషన్‌ను సుమోటోగా స్వీకరించి బట్టు దేవానంద్‌ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో విశాఖ పోలీస్‌ కమిషనర్‌కు హైకోర్టుకు రప్పించారు.

వలంటీర్లను ఎన్నికల విధులకు వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని వేసిన పిటిషన్‌పైన కూడా జస్టిస్‌ దేవానంద్‌ తీర్పు ఇచ్చారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలిచ్చారు.

ఇలా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పులిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బదిలీపై మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఇక సంతోషపడే వీలుందని నెటిజన్లలో చర్చ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News