ప‌ద్దాక అయ్య‌న్న ఇంటికి ఎందుకెళ్తున్నారు?

Update: 2022-07-01 06:30 GMT
మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు ధీటుగా వైఎస్సార్సీపీ నేత‌లు కూడా ప్ర‌తిస్పందిస్తున్నారు. అయితే అటు అయ్య‌న్న‌, ఇటు వైఎస్సార్సీపీ నేత‌లు వాడుతున్న భాష శ్రుతి మించుతుంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

కాగా కొద్ది రోజుల క్రితం ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ఆక్ర‌మించి అయ్య‌న్న‌పాత్రుడు ఇంటి గోడ క‌ట్టార‌ని ఆరోపిస్తూ న‌ర్సీప‌ట్నం మున్సిపల్ అధికారులు ఆయ‌న ఇంటి గోడ‌ను కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. అర్ధ‌రాత్రి క్రేన్లు తెచ్చి, త‌న‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా అధికారులు త‌న ఇంటి గోడ‌ను కూల్చార‌ని అయ్య‌న్న ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో ఏపీ హైకోర్టు తాజాగా ఆయ‌న‌కు ఊర‌ట క‌ల్పించింది.

అయ్యన్నపాత్రుడు ఇంటిని తరచూ సందర్శిస్తూ ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని హోంశాఖ న్యాయవాదులకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మాన‌వేంద్ర‌నాథ్ రాయ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

పోలీసులు తరచూ తన ఇంటిని సందర్శిస్తూ తన వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని అయ్య‌న్న‌పాత్రుడు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. అంతేకాకుండా తనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లు ఇవ్వడంలేదంటూ జూన్ 30న ఆయ‌న‌ అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపించారు. ఆయ్యన్నపై సీఐడీ ఎలాంటి కేసూ నమోదు చేయ‌లేదని ప్రభుత్వ న్యాయవాదులు (హోం) వి.మహేశ్వరరెడ్డి, టీఎంకే చైతన్య తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో కూడా కేసు నమోదు కాలేదన్నారు. మిగిలిన జిల్లాల్లో కేసులు నమోదయ్యాయో లేదో తెలుసుకుని చెబుతామన్నారు.

దీంతో హైకోర్టు ప్ర‌తిసారి అయ్య‌న్న ఇంటికి వెళ్లి ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని పోలీసుల‌ను ఆదేశించింది. ఆయ‌న వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను గౌర‌వించాల‌ని సూచించింది. దీంతో అయ్య‌న్న‌పాత్రుడికి ఏపీ పోలీసుల నుంచి చిక్కులు తొలిగాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకే అయ్య‌న్న‌పాత్రుడిని లక్ష్యంగా చేసుకున్నార‌ని టీడీపీ మండిప‌డుతోంది. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తుంటే త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News