అతి ర‌హ‌స్య జీవోల‌ని ఎలా అంటారు..

Update: 2021-12-22 08:31 GMT
ప్ర‌జ‌ల ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన ఏ ప్ర‌భుత్వ‌మైనా పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త పాటించ‌డం అవ‌స‌రం. ప్ర‌జ‌ల‌కు అందించే సంక్షేమ ప‌థ‌కాలు.. పాల‌న వ్య‌వ‌హారాల కోసం తీసుకునే నిర్ణయాలును జ‌నాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడూ తెలియ‌జేయాలి. జీవోల‌నూ విడుద‌ల చేయ‌డంతో పాటు ప్ర‌భుత్వ వెబ్‌సైట్లో వాటిని ఉంచాలి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని జ‌గ‌న్ స‌ర్కారు ఈ విధానానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. జీవోల‌ను దాచిపెడుతుందంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈ విష‌యంపై హైకోర్టు ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డింది.

జోవోఐఆర్‌టీ వెబ్‌సైట్లో జీవోల‌ను ఎందుకు పెట్ట‌డం లేద‌ని ఏపీ ప్ర‌భుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సాఫీగా సాగే ప్ర‌క్రియ‌కు ఎందుకు ఆటంకం క‌లిగిస్తున్నారంటూ మండిప‌డింది. కొన్ని రోజులుగా ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను తెలిపే జీవోల‌ను వైసీపీ స‌ర్కారు వెబ్‌సైట్లో పెట్ట‌డం లేదు. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో జీవోల‌ను ఈ-గెజిట్‌లో ఉంచుతామ‌ని గ‌తంలో జీవో జారీ చేసింది. దాన్ని వ్య‌తిరేకిస్తూ కొంత‌మంది హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. వాటిపై ఈ రోజు విచార‌ణ జ‌రిగింది. ఈ- గెజిట్‌లో కూడా పూర్తిస్థాయిలో ప్ర‌భుత్వం జీవోలు ఉంచ‌డం లేద‌ని కేవ‌లం 4 నుంచి 5 శాతం మాత్ర‌మే పెడుతుంద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది ఎల‌మంజుల బాలాజీ వాద‌న‌లు వినిపించారు. ప్ర‌భుత్వ తీరు స‌మాచార హ‌క్కు చ‌ట్టానికి వ్య‌తిరేక‌మ‌ని ఆయ‌న కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మ‌రోవైపు ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది త‌న వాద‌న‌లు వినిపిస్తూ అతి ర‌హ‌స్య జీవోలు మాత్ర‌మే వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయ‌డం లేద‌ని కోర్టుకు వివ‌రించారు. దీనిపై స్పందించిన కోర్టు ప్రభుత్వ విధానాన్ని త‌ప్పుప‌ట్టింది. జీవోలు ర‌హ‌స్యం, అతి ర‌హ‌స్య‌మ‌ని ఎలా నిర్ణ‌యిస్తార‌ని ప్ర‌శ్నించింది. అన్ని జీవోల వివ‌రాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. వెబ్‌సైట్లో ఉంచిన వాటితో పాటు ర‌హ‌స్య జీవోల వివ‌రాలు తెల‌పాల‌ని కోర్టు స్ప‌ష్టం చేస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 28కి వాయిదా వేసింది.
Tags:    

Similar News