ప్రభుత్వ పాఠశాలల ఇష్యూలో ఏపీ సర్కారు పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

Update: 2021-08-09 11:42 GMT
ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైనంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వంలోని కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులపై మండిపడింది. ఈ సందర్భంగా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అనధికార నిర్మాణాల్ని చేపట్టటంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల వద్ద రైతు భరోసా కేంద్రాలు.. పంచాయితీ కార్యాలయాలు.. గ్రామ సచివాలయాల ఏర్పాటు వ్యవహారంలో కోర్టు ధిక్కారం కింద నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని కోర్టుకు పిలిపించింది.  

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల వద్ద ఎలాంటి భవనాలు.. నిర్మాణాలు నిర్మించొద్దంటూ గతంలో హైకోర్టు పేర్కొంది. అయినప్పటికీ అలాంటివి నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టులో సవాలు విసిరారు. దీనికి సంబంధించిన విచారణ తాజాగా హైకోర్టులో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పంచాయితీ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది.. కమిషనర్ గిరిజాశంకర్.. పురుపాలక శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మీ.. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ లు హాజరయ్యారు.

స్కూల్ ఆవరణలో ఎలాంటి భవనాలు నిర్మించొద్దని తాము ఇచ్చిన ఆదేశాల్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేద ప్రజలు చదువుకునే పాఠశాలల వద్ద వాతావరణం కలుషితం చేస్తున్నారన్న ఉన్నత న్యాయస్థానం.. 'మీలో ఎవరైనా ఈ పాఠశాలల్లో చదువుకున్నారా?' అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ సూటిగా ప్రశ్నించారు.

తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయి? అని ప్రశ్నించిన న్యాయమూర్తి.. ప్రభుత్వం తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పక పోతే ఎలా? అని ప్రశ్నించారు. పాఠశాల ఆవరణలోకి రాజకీయాల్ని తీసుకొస్తున్నారంటూ మండిపడ్డ హైకోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తమకు వెల్లడించిన అన్ని అంశాల్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లి.. అన్ని వివరాలతోకలిసి నివేదిక కోర్టుకు అందజేస్తామని ఏజీ పేర్కొన్నారు. అంతేకాదు.. తదుపరి వాయిదాకు సైతం హైకోర్టుకు హాజరైన అధికారులంతా మరోసారి హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Tags:    

Similar News