వైసీపీ మంత్రి సైలెంట్ వెనక... ?

Update: 2022-02-15 00:30 GMT
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈమధ్య కాస్తా డల్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. కొత్త ఏడాది ఎంట్రీ ఇస్తూనే ఆయన బాగా తగ్గారని అంటున్నారు. దానికి రాజకీయ కారణలు అనేకం ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆయన పెద్దగా మాట్లాడకుండా తానేంటో తన పనేంటో అన్నట్లుగా ఉన్నారని చెబుతున్నారు.

మంత్రి వర్గ విస్తరణలో ఆయన పదవి పోతుందన్న సమాచారం ఉందని అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. అలా చూసుకుంటే విశాఖ జిల్లా కోటాలో మంత్రి అవంతితో పాటు, గాజువాక నుంచి గెలిచిన తిప్పల నాగిరెడ్డి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు ఇచ్చినా కూడా ఆయన పార్టీ లెక్కలోకి రారు.

దాంతో విశాఖలో కొత్తగా మంత్రిని ఎవరిని తీసుకుంటారు అన్నదే చర్చగా ఉంది. అయితే ఎమ్మెల్సీగా ఈ మధ్యనే నియమితులైన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి ఈ గోల్డెన్ చాన్స్ దక్కుతుంది అంటున్నారు.

 బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పెద్ద పీట వేయడం ద్వారా విశాఖ సిటీలో వారికి చేరువ అవుదామన్న ఎత్తుగడ వైసీపీ పెద్దలకు ఉందని అంటున్నారు. విజయసాయిరెడ్డికి కూడా ఆయన సన్నిహితుడు. పైగా పార్టీకి వీర విధేయుడు.

దాంతో మంత్రి సైలెంట్ గా ఉన్నారు అని అంటున్నారు. దీనికి తోడు తన సొంత సీటు భీమిలీలో  మారిన రాజకీయ పరిణామాలు కూడా ఆయన్ని కలవరపెడుతున్నాయి. అక్కడ టీడీపీ మొదటి నుంచి బలంగా ఉంది.

ఇక జనసేన కూడా ఫస్ట్ టైమ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి పాతిక వేల దాకా ఓట్లు తెచ్చుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిస్తే అనూహ్యమైన మెజారిటీ ఆ కూటమికి వస్తుంది.

2019 ఎన్నికల్లో అవంతి గెలిచింది కూడా కేవలం తొమ్మిది వేల ఓట్లతోనే. దాంతో వచ్చే ఎన్నికల్లో అవంతి గెలుపు మీద నీలి నీడలు కమ్ముకున్నాయని అంటున్నారు. మంత్రిగా కొనసాగిస్తే ఏమైనా లాభం ఉంటుందేమో కానీ మాజీ మంత్రిగా బరిలోకి దిగితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
Tags:    

Similar News