వివాదాలతో సహజీవనం చేస్తున్నారా ?

Update: 2021-09-08 12:30 GMT
కరోనా వైరస్ తో మనం సహజీవనం చేయకతప్పదని ఆమధ్య ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇపుడు మంత్రివర్గంలోని ఒక మంత్రి వ్యవహారం చూస్తుంటే ఈయన వివాదాలతో సహజీవనం చేస్తున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  జయరాం మంత్రయిన దగ్గర నుండి చిన్నదో పెద్దదో ఏదో ఓ వివాదంలో మంత్రిపేరు వినిపిస్తునే ఉన్నాయి. మూడు వివాదాల్లో అయితే ఏకంగా మంత్రి ఇన్వాల్వ్ మెంటే ఉందని తేలటంతో బాగా వైరల్ గా మారిపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలు జిల్లాలోని ఆలూరు అంటే తన నియోజకవర్గంలో ఎసై తన మద్దతుదారులకు చెందిన ట్రాక్టర్లను పట్టుకున్నారట. దాన్ని విడిచేయమని చెప్పటానికి ఎస్ఐకి ఫోన్ చేసిన మంత్రి బెదిరింపులకు దిగారన్న విషయం బయటపడింది. మంత్రి-ఎస్ఐకి జరిగిన మొబైల్ సంభాషణ ఇపుడు వైరల్ గా మారింది. అక్రమంగా ఇసుకలారీల లోడుతో వెళుతున్న లారీలను పోలీసులు పట్టుకుంటే వాటిని విడిచేయమని చెప్పటం ఏమిటంటూ ప్రతిపక్షాలు గోల మొదలుపెట్టాయి.

అయితే మంత్రి వెర్షన్ మాత్రం వేరేవిధంగా ఉంది. తన నియోజకవర్గంలో అసలు ఇసుక రీచలే లేవట. ఖాళీ ట్రాక్టర్లను ఎసై పట్టుకున్న కారణంగా వాటిని విడిచిపెట్టమని తాను ఫోన్ చేసిన మాట వాస్తవమే అని మంత్రంటున్నారు. ఖాళీ ట్రాక్టర్ల యజమానులు తన దగ్గరకు వచ్చి విషయం చెప్పగానే ఎస్సైకి ఫోన్ చేసి గట్టిగా చెప్పానని మంత్రి అంగీకరించారు. ప్రతిపక్షాలే వాస్తవం తెలుసుకోకుండా తనపై బురద చల్లుతున్నారంటు మండిపోతున్నారు.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే గతంలో ఒకసారి తన సొంతగ్రామంలోనే పేకాట వ్యవహారం బాగా వివాదాస్పదమైంది. తన గ్రామంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు అకాస్మత్తుగా దాడులు చేశారు. మామూలుగా అయితే పోలీసులు దాడి చేస్తున్నారని తెలియగానే అందరు అక్కడినుండి పారిపోతారు. కానీ ఇక్కడమాత్రం పోలీసులపైనే కొందరు దాడులుచేసి గాయపరిచారు.  దాంతో విషయం ఒక్కసారిగా రచ్చకెక్కింది. దాడులు చేసిందంతా మంత్రి అనుచరులే అని ప్రతిపక్షాలు నానా గోలచేశాయి.

తర్వాత ఇఎస్ఐ కుంభకోణంలో పాత్రదారుని విషయంలో కూడా మంత్రి వ్యవహారం బాగా వివాదాస్పదమైంది. కారణం ఏమిటంటే కుంభకోణంలో ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బెంజికారులో మంత్రి కొడుకు కనిపించారు. బెంజికారుకు రిబ్బన్ కట్ చేసిన మంత్రి కొడుకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తినుండి మంత్రి కొడుకు బెంజికారును బహుమతిగా తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

తన కొడుకు కారును తీసుకోలేదని సదరు వ్యక్తే తాను కొనుకున్న కొత్తకారుకు తన కొడుక చేత ఓపెనింగ్ చేయించుకున్నట్లు మంత్రి చెప్పారు. సదరు వ్యక్తి, తన కొడుకు మిత్రులంటు మంత్రి కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నంచేశారు. తర్వాత ఆ విషయం ఏమైందో ఎవరికీ తెలీదు లేండి. మొత్తంమీద ఏదో వ్యవహారంలో ఇరుక్కోవటం తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసి తీరిగ్గా వివరణలు ఇచ్చుకోవటం మంత్రికి మామూలైపోయింది. అందుకనే మంత్రి గుమ్మలూరి జయరాం వివాదాలతో సహజీవనం చేస్తున్నారంటు సెటైర్లు పేలుతున్నాయి.
Tags:    

Similar News