షార్జా నుంచి కిలో బంగారు తీసుకొచ్చి దొరికిన ఏపీ ఉన్నతాధికారి భార్య

Update: 2022-09-10 04:25 GMT
ఆమె ఏపీలోని ఒక అత్యున్నత స్థాయి అధికారి సతీమణి. అలాంటి ఆమె.. దుబాయ్ నుంచి కేజీ బంగారాన్ని తీసుకొస్తూ ఎయిర పోర్టులో దొరికిపోయిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ప్రధాన మీడియా సంస్థల్లో దాని వివరాలు బయటకు వచ్చేశాయి. గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఉదంతం.. శుక్రవారం బయటకు వచ్చింది.

నిబంధనల ప్రకారం చూస్తే.. విదేశాల నుంచి పరిమితికి మించి బంగారం తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చినా దాదాపు 30 శాతానికి పైనే పన్ను చెల్లించాలి. కానీ.. భారీగా ఉన్న పన్నును తప్పించుకోవటం కోసం గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరిస్తుంటారు. కొందరు అక్రమ పద్దతుల్ని ఫాలో అవుతుంటారు.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. ఏపీ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సీఈవోగా రేగుళ్ల మల్లికార్జునరావు వ్యవహరిస్తుంటారు. ఆయన సతీమణి నీరజారాణి షార్జా నుంచి కేజీ బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడ్డారు.

షార్జా నుంచి 38 మంది ప్రమాణికులతో ఎయిరిండియా విమానం విజయవాడకు చేరుకుంది. ఈ విమానంలోనే నీరజారాణి కేజీ బంగారు ఆభరణాల్ని తనతో తెచ్చారు. మరో వాదన ఏమంటే.. నీరజారాణి దుబాయ్ లో ఆభరణాల దుకాణాన్ని నిర్వహిస్తారని చెబుతున్నారు.

ఏది ఏమైనా నిబంధనలకు లోబడి బంగారాన్ని తీసుకురావాలే తప్పించి ఇంత భారీగా తేకూడదు. తెచ్చినా పన్ను చెల్లింపులు చేయాలి. కానీ.. అదేమీ ఆమె చేయలేదు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ.. ఆమె వద్ద ఉన్న కేజీ బంగారు ఆభరణాల్ని గుర్తించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. షార్జా నుంచి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాల్ని తరలిస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న డీఆర్ఐ అధికారుల టీం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీ బంగారం దొరకటం సంచలనంగా మారింది. అయితే.. ఆమె ఇలా తరచూ చేస్తారని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News