సర్కారీ స్కూల్లో చ‌దివిన ఏపీ కుర్రాడికి కోటీ జీతం!

Update: 2019-06-29 07:00 GMT
స‌ర్కారీ స్కూల్లో చ‌ద‌వితే స‌రైన జీవితం ఉండ‌ద‌ని చెప్పేటోళ్లు కోట్ల‌మంది క‌నిపిస్తారు. కానీ.. సాధించాల‌న్న క‌సి ఉండాలే కానీ స‌ర్కారీ స్కూలేమీ అవ‌కాశాల్ని కోల్పోయేలా చేయ‌దన్న దానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది తాజా ఉదంతం. ఎక్క‌డో విశాఖ మారుమూల ప‌ల్లెలోని స‌ర్కారీ స్కూల్లో చ‌దివిన కుర్రాడు ఈ రోజున ఏకంగా అమెజాన్ లాంటి కంపెనీలో ఏడాదికి కోటి రూపాయిల వార్షిక వేత‌నంతో మంచి ఉద్యోగాన్ని సాధించ‌టం మామూలు విష‌యం కాదు. ఇంత‌కీ ఈ కుర్రాడు ఎవ‌రు?  అంత మంచి ఉద్యోగాన్ని ఎలా సాధించాడు?  స‌ర్కారీ స్కూల్లో మొద‌లైన ప్ర‌యాణం అమెరికా వ‌ర‌కూ ఎలా సాగింద‌న్న విష‌యాల్లోకి వెళితే..

విశాఖ జిల్లాలోని చింత‌ల ఆగ్ర‌హారం గ్రామానికి చెందిన కుర్రాడు అడారి మ‌ణికుమార్‌. ఇద్ద‌రు తోబుట్టువులున్న ఇత‌గాడు అదే గ్రామంలోని హైస్కూల్లో 2008 వ‌ర‌కు చ‌దివాడు. ప‌దో త‌ర‌గ‌తిలో 548 మార్కులు సాధించ‌టం ద్వారా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాడు. తండ్రి ఎల‌క్ట్రీషియ‌న్ కాగా.. త‌ల్లి వ్య‌వ‌సాయ కూలీ. చిన్న‌త‌నం నుంచి క‌ష్టం అంటే ఏమిటో తెలియ‌టం.. ఎలాగైనా తాను వృద్ధిలోకి రావాల‌న్న త‌ప‌న మ‌ణిలో ఉండేది.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు ద‌క్కించుకున్న త‌ర్వాత ఒక‌వైపు చ‌దువు.. మ‌రోవైపు ప్ర‌ముఖ ప్రోగ్రామింగ్ వెబ్ సైట్ల అల్గారిథ‌మ్ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల్ని క‌నుగొనేవాడు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ పై ప‌ట్టు సాధించిన అత‌గాడు బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ లో ఉన్న‌ప్పుడే అమెజాన్ మిష‌న్ లెర్నింగ్ లో ఇంట‌ర్న్ షిప్ చేసే ఛాన్స్ ల‌భించింది. బీటెక్ లో క్యాంప‌స్ సెల‌క్ష‌న్ల ద్వారా ప‌లు కంపెనీల్లో జాబ్ వ‌చ్చినా.. న‌చ్చ‌క చేర‌లేదు.

ఆ త‌ర్వాత ఒక స్టార్ట‌ప్ లో ఏడాదికి రూ.8ల‌క్ష‌ల జీతానికి చేరాడు. ఆ కంపెనీని స్నాప్ డీల్ కొనుగోలు చేయ‌టంతో 2015లో అమెజాన్ సంస్థ‌లో ప‌ని చేసే అవ‌కాశం ల‌భించింది. అలా ఎదిగిన అతనికి తాజాగా రూ.కోటి జీతం ఇచ్చి అమెజాన్ భారీ ఆఫ‌ర్ ఇచ్చింది. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వాలేకానీ.. చ‌దివేది స‌ర్కారీ స్కూలా.. ప్రైవేటు స్కూలా అన్న దాని విష‌యంలో పెద్ద తేడా ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News