వారసులూ జిందాబాద్... వైసీపీలో కొత్త గోల

Update: 2022-09-14 02:30 GMT
వైసీపీలో ఎపుడూ ఏదో అంశం మీద నాయకులు గోల చేస్తూనే ఉంటారు. అధినాయకత్వం ఎంత కఠినంగా ఉంటున్నా కూడా తమ ఇష్టాలను ఎవరూ దాచుకోవడంలేదు. దానికి కారణం వైసీపీలో ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. అక్కడ స్వేచ్చను పూర్తిగా అనుభవించినవారే. అందుకే వారు వైసీపీ ప్రాంతీయ పార్టీ అని తెలిసినా పరిధులు పరిమితులు కూడా తెలిసినా ఒక్కోసారి తమ హద్దులను దాటేస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా నుంచి ఏపీ అంతా చూసుకుంటే వైసీపీలోనే ఈసారి వారసుల గోలా చాలా ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. జగన్ ఈసారి యూత్ కి టికెట్లు అంటున్నారని తమ పుత్ర రత్నాలను ముందు వరసలోకి తెచ్చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన కుమారుడిని ఆ మధ్య తీసుకుని జగన్ని కలసి వచ్చారు. ఏ కారణం చేతనైనా తనకు టికెట్ లేకపోతే తన కుమారుడికి భీమిలీ టికెట్ ఇప్పించుకోవాలని ముత్తంశెట్టి ప్లాన్ అని అంటున్నారు.

ఇక గాజువాకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ణి ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడు దేవాన్ రెడ్డికే టికెట్ వచ్చేలా చూసుకుంటున్నారు. అక్కడ వైసీపీ క్యాడర్ కూడా ఇదే విషయం ప్రచారం చేసుకుంటోంది. ఈసారి తిప్పల కుమారుడే ఎమ్మెల్యే అవుతారని కూడా ఆయన అనుచరులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఈసారి తనకు కాకుండా తన కుమారుడి డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార వర్మకు టికెట్ ఇవ్వాలని కోరేందుకు ఈ మధ్యనే జగన్ని కలిశారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. కొడుకుని వెంటబెట్టుకుని మరీ ఆయన జగన్ని కలవడంతో ఈ ప్రచారం నిజమేనా అని అంతా అనుకుంటున్నారు.

ఇక విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమారుడి డాక్టర్ సందీప్ ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారని టాక్ ఎటూ ఉంది. అలాగే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తె శ్రావణికి ఈసారి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు.

శ్రీకాకుళంలో చూస్తే ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ తమ వారసులు కొడుకులకు టికెట్లు అడుగుతున్నారని అంటునారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా తన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ని అముదాలవలస నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇదే  రకంగా  ఏపీలో చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు తమ వారసులను ముందు పెట్టి టికెట్లు కోరుతున్నారు. మరి జగన్ దీని మీద ఏమంటారో చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News