ప్ర‌జాకోర్టులో కిడారి వాంగ్మూలం ఇదేనా?

Update: 2018-09-27 11:36 GMT
అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర రావు, మాజీ ఎమ్మెల్యే సోమ ను మావోయిస్టులు దారుణంగా హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట హ‌త్య‌ల‌తో మ‌న్యం ఒక్క‌సారిగా ఉలిక్కిపడింది. అయితే, ప‌క్కాగా రెక్కీ నిర్వ‌హించిన త‌ర్వాతే కిడారి, సోమ‌ల‌ను మావోలు హ‌త్య చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఇద్ద‌రి హ‌త్య‌ల అనంత‌రం కూడా ఇద్ద‌రు మావోలు....ఘ‌ట‌నాస్థ‌లం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప‌రిస్థితిని స‌మీక్షించిన వీడియో పోలీసుల‌కు చిక్కింది. అయితే,  ఆ ఇద్ద‌రి హ‌త్య‌కు ముందు మావోలు ప్ర‌జాకోర్టు నిర్వ‌హించార‌ని, కిడారిని, సోమ‌ను గంట పాటు విచార‌ణ జ‌రిపార‌ని ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ఇద్ద‌రిని మావోలు ప‌లు ప్ర‌శ్న‌లు అడిగార‌ని, రాజ‌కీయాలు వ‌దిలేస్తామ‌ని, త‌మ‌ను చంపొద్ద‌ని ప్రాధేయప‌డిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

పార్టీ మారినందుకు ఎంత డ‌బ్బు ముట్టింద‌ని కిడారిని మావోలు అడిగిన‌ట్లు తెలుస్తోంది. గిరిజన కోటాలో మంత్రి పదవితో పాటు, భారీగా డ‌బ్బు ముట్ట‌జెబుతామ‌ని చంద్రబాబు హామీఇచ్చాడని కిడారి చెప్పినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాను అందుకున్న డ‌బ్బు ఎంతో చెప్ప‌గానే మావోలు షాక‌య్యార‌ని ఓ క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. అంత భారీ మొత్తం తీసుకున్న చాల‌క‌  మైనింగ్ కు పాల్పడడం ఏమిట‌ని మావోలు ప్ర‌శ్నించార‌ట‌. దీంతో పాటు, మైనింగ్ వ్యాపారంలో  సోమ‌కు కూడా భాగ‌స్వామ్యం ఉంద‌ని మావోల ద‌గ్గ‌ర స‌మాచారం ఉండ‌డంతోనే ఆయ‌న‌ను హ‌త్య చేసిన‌ట్లు తెలుస్తోంది. మైనింగ్ లో వాటాపై సోమ‌ను కూడా మావోలు విచార‌ణ జ‌రిపార‌ని క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. మైనింగ్ లో త‌న‌కు 25శాతం వాటా ఉంద‌ని, పెట్టుబడి అంతా కిడారిదేన‌ని సోమ చెప్పార‌ట‌. ఏది ఏమైనా....అనధికారికంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతోన్న అక్ర‌మ మైనింగ్ వ‌ల్లే ఈ హ‌త్య‌లు జ‌రిగాయ‌ని స్థానికులు చ‌ర్చించుకుంటున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News