70 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారా....?

Update: 2023-01-17 07:11 GMT
వైసీపీలో అతి పెద్ద నంబరే లేచిపోతోంది అన్న టాక్ ఇపుడు సర్వత్రా కలవరం రేపుతోంది. సాధారణంగా ఏ పార్టీ అయినా కొంతమందికి టికెట్లు నిరాకరించడం మామూలే. అయితే వైసీపీలో మొదట ముప్పయి దాకా ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఆ నంబరే చాలా పెద్దది అని అంతా భావిస్తూంటే ఇపుడు అది కాస్తా డెబ్బయికి చేరుకుంది అని అంటున్నారు. అంటే గెలిచిన వారిలో సగానికి సగం మంది అన్న మాట.

అంటే ఏకంగా ఫిఫ్టీ పెర్సెంట్ అన్న మాట. దీంతో వైసీపీలో రాజకీయ సునామీయే  అన్న వారూ ఉన్నారు. ఇప్పటికే ఇందులో ముప్పయి మంది ఎమ్మెల్యేలకు అధినాయకత్వం హింట్ ఇచ్చేసింది అని అంటున్నారు. దాంతో వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ పేర్లు బయటకు రావడంతో ఆయా ఎమ్మెల్యేలు తీవ్ర వత్తిడికి గురి అవుతున్నారు. కొందరైతే బయటపడి అధినాయకత్వానికి వ్యతిరేకంగా హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

మరో వైపు చూస్తే ప్రతీ నియోజకవర్గంలో సర్వేలు చేస్తున్న పీకే టీం కనీసంగా డెబ్బై మంది ఎమ్మెల్యేలను తప్పించకపోతే కష్టమని తేల్చి చెబుతోందిట. దాంతో ఇపుడు ఆ డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఎవరు అన్న చర్చ ముందుకు వస్తోంది. ఇలా డెబ్బై మంది ఎమ్మెల్యేలు అంటే మామూలుగా హడలిపోయే విషయమే కానీ పీకే టీం చెబుతున్నది మాత్రం లాజిక్ గానే ఉంది అంటున్నారు.

అదెలా అంటే 2019 ఎన్నికల వేళ  జగన్ కే ఓటు అన్న బలమైన నినాదంతో ఒక పెద్ద ప్రభంజనం పనిచేసింది. జగన్ గెలవాలి. ఆయన సీఎం అవాలి అని మొత్తం ఏపీ జనాలు వేసిన ఓట్లతో జనాలకు ఏ మాత్రం పరిచయం లేని వారు ముక్కూ మొహం తెలీయని వారు కూడా ఎమ్మెల్యేలు ఓవర్ నైట్ అయిపోయారు అని అంటున్నారు. ఇపుడు మళ్లీ వారినే ముందుకు పెట్టి 2024లో రాజకీయ జూదమాడితే ఓటమి తప్పదని పీకే టీం పక్కాగా క్లారిటీని ఇచ్చింది అని అంటున్నారు.

ఇక జనాలు గుర్తు పట్టని వారు తమ నియోజకవర్గంలో ఈ రోజుకూ ఎమ్మెల్యే అన్న ముద్ర వేసుకోని వారు లెక్క తీసి చూస్తే డెబ్బై మంది దాకా ఉన్నట్లుగా పీకే టీం  తేల్చిందట. మరో వైపు చూస్తే ఏపీలో రాజకీయం మారుతోంది. పొత్తులతో ఎత్తులతో విపక్షం దూకుడుగా ముందుకు దూసుకుని వస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన కలుస్తాయని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కనుక పొత్తు పెట్టుకుని వస్తే మాత్రం ఈ డెబ్బై మంది ఏ మాత్రం డౌట్ లేకుండా అడ్రస్ గల్లంతు అయి ఓడిపోతారు అని పీకే టీం వైసీపీ హై కమాండ్ కి ఒక సీరియస్ వార్నింగ్ నే ఇచ్చింది అని అంటున్నారు.

నిజంగా ఇది వైసీపీ హై కమాండ్ కి టఫ్ టాస్క్ అంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేలలో సగానికి సగం మందికి టికెట్లు లేవు అని చెబితే పార్టీలో అతి పెద్ద కల్లోలం చెలరేగడం ఖాయం. అది ఎటు వైపు దారితీస్తుంది అన్నది కూడా ఎవరికీ అంతు చిక్కని వ్యవహారమే అని అంటున్నారు. దాంతో పీకే టీం కటువుగా అయితే సర్వే నివేదికను ఇచ్చి పారేసింది కానీ దాన్ని అమలు చేయడం వైసీపీ హై కమాండ్ కి కత్తి మీద సాము లాంటి వ్యవహారమే అని అంటున్నారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న జగన్ కి ఈ సర్వే నివేదికలు ఏ మాత్రం మింగుడు పడడంలేదు అని అంటున్నారు. అందుకే ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. జగన్ ఆలోచనల మేరకు అయితే ముప్పయి మంది దాకా ఎమ్మెల్యేల టికెట్లు అసలు ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారని అంటున్నారు. వీరిలో సీనియర్ నేతలతో పాటు ప్రస్తుత మంత్రులలో కొందరు, అలాగే మాజీ మంత్రులు కూడా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇపుడు ఆ సంఖ్య డెబ్బైకి చేరుకోవడంతో జగన్ ఏం చేయబోతున్నారు అన్నది అతి పెద్ద చర్చగా ఉంది.

అంతే కాదు ఈ పెరిగిన నంబర్ తో కచ్చితంగా సీనియర్లు, సన్నిహితులు కూడా ఇందులోకి వస్తారు అని అంటున్నారు. అదే విధంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా పేరున్న రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ మంది సిట్టింగులకు సీట్లు చిరిగిపోతాయని అంటున్నారు. అదే విధంగా ఉత్తరాంధ్రాలో కూడా చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వరని ప్రచారం సాగుతోంది. దీని తరువాత గోదావరి జిల్లాలో కూడా సీట్ల కత్తిరింపు ఉంటుంది అంటున్నారు. అక్కడ జనసేన తెలుగుదేశం ప్రభావం ఉంటుంది అని అంటున్నారు.

అయితే ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను కనుక టికెట్లు లేదు అని చెప్తే అది పార్టీలోనే తిరుగుబాటుకు దారి తీసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. రానున్న రోజుల్లో అది ఎగిసిపడుతుందని, అపుడు వైసీపీ హై కమాండ్ ఏ రకంగా దాన్ని తట్టుకుని నిలబడుతుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News