ఈసీకి మ‌ర‌క‌లు వేస్తున్న మోడీ బ్యాచ్!

Update: 2019-03-28 11:52 GMT
మోడీ మీడియా స‌మావేశంపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఉప‌గ్ర‌హ విధ్వంస‌క క్షిప‌ణి ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌టంపై భార‌త్ శ‌క్తిని కీర్తిస్తూ ప్ర‌సంగించ‌టం తెలిసిందే. కీల‌క‌మైన ప్ర‌యోగాన్ని ఇప్పుడే ఎందుకు నిర్వ‌హించాల్సి వ‌చ్చింది?  ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. ఆ ప్ర‌యోగం వాయిదా వేసినంత మాత్రాన కొంప‌లు మునిగిపోతాయా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం లేని ప‌రిస్థితి.

ఒక‌వేళ‌.. ప్ర‌యోగాన్ని నిర్వ‌హించినా దాన్ని ఎన్నిక‌ల త‌ర్వాత అధికారాన్ని చేప‌ట్టే ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తే స‌రిపోయేది. కానీ.. అందుకు భిన్నంగా హ‌డావుడిగా జాతిని ఉద్దేశించి రేడియో.. టీవీల‌లో మోడీ ప్ర‌సంగించ‌టం.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సుదీర్ఘంగా గొప్ప‌లు చెప్పుకోవ‌టంపై సోష‌ల్ మీడియాలోనూ.. రాజ‌కీయ రంగంలోనూ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

శాస్త్ర సాంకేతిక రంగంలో ఘ‌న విజ‌యాన్ని మోడీ త‌న గొప్ప‌గా చెప్పుకోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇది క‌చ్ఛితంగా ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘించ‌ట‌మేన‌న్న మాట వినిపిస్తోంది. ఈసీ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. కొన్ని అంశాల మీద ఫిర్యాదులు అందిన వెంట‌నే రియాక్ట్ అయ్యే ఎన్నిక‌ల సంఘం.. మ‌రి.. ఇంత ఓపెన్ గా ప్ర‌ధాని స్థానంలోఉన్న వ్య‌క్తి ఇంతలా గొప్ప‌లు చెప్పుకోవ‌టాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌రు? అని ప్ర‌శ్నిస్తున్నారు. తాజా ఉదంతాన్ని ఎన్నిక‌ల సంఘం ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పినా.. దానిపై మ‌ర‌క‌లు వేసే అవ‌కాశాన్ని ప్ర‌ధాని క‌ల్పిస్తున్నార‌ని చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే..ఎన్నిక‌ల కోడ్ కు విరుద్దంగా మోడీ.. ఆయ‌న ప‌రివారం వ్య‌వ‌హ‌రించ‌టం కొత్తేమీ కాద‌ని.. ఇప్ప‌టికి ప‌లుసార్లు ఇలాంటివి చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. మోడీపై తీసిన బ‌యోపిక్ ను ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌టాని నిర్ణ‌యించ‌టం.. రైలు.. విమాన టికెట్ల మీద మోడీ బొమ్మ‌ను ముద్రించి అందించ‌టం.. మేమంతా బీజేపీ కార్య‌క‌ర్త‌లం.. మోడీ త‌ప్ప‌కుండా గెల‌వాలంటూ గ‌వ‌ర్న‌ర్ స్థానంలో ఉన్న వారు వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

విలువ‌లు అంత‌కంత‌కూ ప‌డిపోవ‌టం ఏ మాత్రం స‌రికాదు. అందుకు అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారు ర‌క్ష‌కులుగా ఉండాలే కానీ.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏ మాత్రం స‌రికాదు. అధికారం కోసం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం మొద‌లు కావ‌టంతోనే ఆగ‌ద‌ని.. త‌ర్వాతి కాలంలో వ్య‌వ‌స్థ‌లు మొత్తం భ్ర‌ష్టు ప‌ట్ట‌టం ఖాయ‌మ‌న్న హెచ్చ‌రిక‌ల్ని ప‌లువురు చేస్తున్నారు. మ‌రి.. ఇలాంటివి మోడీ ప‌రివారానికి వినిపిస్తాయో లేదో? 
Tags:    

Similar News